Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Proverbs 19 >> 

1బుద్ధిహీనుడై కుటిలంగా మాట్లాడే వాడి కంటే యథార్థంగా ప్రవర్తించే పేదవాడే గొప్ప.

2ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు.

3ఒకడి మూర్ఖత్వం వాడి బ్రతుకును ధ్వంసం చేస్తుంది. అలాటి వాడు యెహోవాా మీద మండిపడతాడు.

4సంపద స్నేహితులను సమకూరుస్తుంది. దరిద్రుడికి స్నేహితులు దూరమౌతారు.

5అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.

6ఉదార గుణం గలవారిని చాలామంది సహాయం కోసం అడుగుతారు. ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే.

7పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు.

8బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు.

9అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.

10బుద్ధిహీనుడు సుఖ భోగాలనుభవించడం తగదు. ఒక బానిస రాజులపై ఏలుబడి చేయడం అంతకన్నా తగదు.

11విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత.

12రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది.

13మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం.

14ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాాయే.

15సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.

16ఆజ్ఞ పాటించేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనివాడు చచ్చిపోతాడు.

17పేదలను ఆదుకోవడం అంటే యెహోవాాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

18అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు.

19పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది.

20సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు.

21మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవాా ఉద్దేశాలే నిలబడతాయి.

22మనిషి కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు.

23యెహోవాాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.

24సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు.

25హేళన చేసే వారిని దండించు, అది చూసి ఆజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారు జ్ఞానంలో ఎదుగుతారు.

26తండ్రిని బాధిస్తూ తల్లిని తరిమేసేవాడు సిగ్గు, అపకీర్తి తెచ్చే కొడుకు.

27కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు.

28చెడిపోయిన సాక్షి న్యాయాన్ని గేలి చేస్తాడు. దుర్మార్గుల నోరు దోషాన్ని జుర్రుకుంటుంది.

29అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు.


  Share Facebook  |  Share Twitter

 <<  Proverbs 19 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran