Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Proverbs 14 >> 

1జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.

2యెహోవాాపట్ల భయం, భక్తి ఉన్నవాడు నిజాయితీగా మసులుకుంటాడు. కపటంగా ప్రవర్తించే వాడు ఆయనను తిరస్కరిస్తాడు.

3మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి.

4ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది.

5నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.

6బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.

7బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.

8వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.

9మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు.

10ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.

11దుర్మార్గుడి యిల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది.

12ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.

13ఒకడు బయటికి నవ్వుతో ఉన్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. సంతోషం చివరికి శోకంగా మారిపోవచ్చు.

14భక్తిహీనుడి మార్గాలు చివరికి వాడికే వెగటు కలుగుతాయి. మంచి వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తి చెందుతాడు.

15తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.

16జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు.

17తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు.

18బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.

19చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల గుమ్మాల ఎదుట నిలబడతారు.

20దరిద్రుణ్ణి వాడి పొరుగువాడే అసహ్యించుకుంటాడు. ధనవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలామంది.

21పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.

22కీడు తలపెట్టేవారు కూలిపోతారు. మేలు చేసే వారికి దయ, సత్యం ప్రాప్తిస్తాయి.

23కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.

24ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.

25నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.

26యెహోవాాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది.

27యెహోవాా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.

28జనాభా పెరుగుదల రాజులకు ఘనత కలిగిస్తుంది. ప్రజల క్షీణత రాజుల పతనానికి కారణం.

29వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.

30సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది.

31దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.

32కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి మరణ సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.

33తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.

34ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.

35తెలివి గల సేవకుడు రాజుల అభిమానం చూరగొంటాడు. అవమానం కలిగించే సేవకుడిపై రాజు కోప పడతాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Proverbs 14 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran