Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Chronicles 33 >> 

1మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు.

2ఇతడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి యెహోవా వెళ్లగొట్టిన రాజ్యాల ప్రజలు చేసిన నీచమైన పనులు అనుసరించి, యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు.

3ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఎత్తైన స్థలాలను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠాలను నిలిపి, అషేరా దేవతాస్తంభాలను చేయించి, ఆకాశనక్షత్రాలన్నిటిని పూజించి కొలిచాడు.

4<<యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది>> అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరంలో అతడు అన్య దేవతలకు బలిపీఠాలను కట్టించాడు.

5యెహోవా మందిరపు రెండు ఆవరణాలలో అతడు ఆకాశ నక్షత్ర సమూహానికి బలిపీఠాలను కట్టించాడు.

6బెన్‌హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారినీ దయ్యాలతో మాట్లాడే వారినీ సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

7<<ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో నాపేరు ఎల్లప్పుడూ ఉంచుతాను.

8నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనడానికి వారు జాగ్రత్తపడితే, మీ పూర్వీకులకు నేను ఏర్పరచిన దేశంనుంచి ఇశ్రాయేలీయులను నేను ఇక ఎన్నటికీ తొలగించను>> అని దావీదుతో అతని కొడుకు సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరంలో తాను చేయించిన అషేరా చెక్కుడు విగ్రహాన్ని నిలిపాడు.

9యూదావారినీ యెరూషలేము నివాసులనూ ఇశ్రాయేలీయుల ముందు నుంచి యెహోవా నాశనం చేసిన రాజ్యాలకంటే వారు మరింత దుర్మార్గంగా ప్రవర్తించేలా మనష్షే వారిని నడిపించాడు.

10యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు కానీ వారు పట్టించుకోలేదు.

11కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతుల్ని వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకొని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసికొని వెళ్ళారు.

12బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను బహుగా తగ్గించుకొన్నాడు.

13అతడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతని విన్నపాలు ఆలకించి యెరూషలేముకు, అతని రాజ్యానికి అతణ్ణి తిరిగి తీసికొనివచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు.

14దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకు ఓపెలు చుట్టూ చాలా ఎత్తైన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతుల్ని ఉంచాడు.

15యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతావిగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు.

16అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.

17అయినా ప్రజలు ఎత్తయిన స్థలాలలో ఇంకా బలులు అర్పిస్తూనే ఉన్నారు గాని అవి తమ దేవుడైన యెహోవాకే అర్పించారు.

18మనష్షే గురించిన ఇతర విషయాలు, అతడు దేవునికి చేసిన ప్రార్థన గురించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘ దర్శకుల మాటలను గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.

19అతని ప్రార్థన, దేవునికి ఎలా మొర్రపెట్టాడో, తనను తాను తగ్గించు కొనక ముందు అతని పాపం గురించి, అతడు చేసిన ద్రోహం గురించి, కట్టించిన ఎతైన పూజా స్థలాలూ అషేరాదేవి స్తంభాలు, చెక్కిన విగ్రహాలను నిలపడం గురించి, దీర్ఘదర్శకుడలు రచించిన గ్రంథాలలో రాసి వుంది.

20మనష్షే చనిపోయినప్పుడు తన పూర్వీకులతో కూడ తన సొంత భవనంలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు ఆమోను అతనికి బదులు రాజయ్యాడు.

21ఆమోను పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతడు 22 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పాలించాడు.

22అతడు తన తండ్రి మనష్షే నడచినట్టు యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించాడు. తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు.

23తన తండ్రియైన మనష్షేలాగా యెహోవా సన్నిధిలో తనను తాను తగ్గించుకోలేదు. దానికి బదులు ఇంకా ఎక్కువ పాపం చేశాడు.

24అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని సొంత భవనంలోనే అతణ్ణి చంపేశారు.

25అయితే దేశప్రజలు ఆమోను రాజుమీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కొడుకు యోషీయాను అతని స్థానంలో రాజుగా నియమించారు.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 33 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran