Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Chronicles 21 >> 

1యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.

2యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు.

3వారి తండ్రి బహుమానాలుగా, వెండి, బంగారం ఇంకా ఎన్నో విలువైన వస్తువుల్ని, యూదాదేశంలో గోడలున్న పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము తనకు పెద్ద కొడుకు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు.

4యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన అధికారం సుస్థిరం చేసుకున్న తరువాత తాను స్థిరపడి, తన సోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతులలో కొంత మందినీ చంపేసాడు.

5యెహోరాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 ఏళ్ళు పాలించాడు.

6అతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసికొని, అహాబు సంతతివారు నడచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల పద్ధతుల్లో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు.

7అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.

8యెహోరాము రోజుల్లో యూదా రాజుల అధికారానికి వ్యతిరేకంగా ఎదోమీయులు తిరుగుబాటు చేసి తమకు ఒక రాజును ఉంచుకున్నారు.

9యెహోరాము తన అధికారులను వెంటబెట్టుకొని, తన రథాలన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుముట్టిన ఎదోమీయులనూ రథాధిపతులను చంపేసాడు.

10కాబట్టి ఇప్పటి వరకు ఎదోమీయులు యూదావారి అధికారం కింద ఉండక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహోరాము తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విస్మరించినందుకు అదే సమయంలో లిబ్నా పట్టణం కూడా అతని అధికారం కింద ఉండకుండా తిరుగుబాటు చేసింది.

11యెహోరాము యూదా కొండల్లో బలిపీఠాలు కట్టించి యెరూషలేము నివాసులు వేశ్యలా ప్రవర్తించేలా చేశాడు. ఈ విధంగా అతడు యూదావారిని తప్పుదారి పట్టించాడు.

12ఏలీయా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది, <<నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, <నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గాలలో గానీ యూదారాజు ఆసా మార్గాలలో గానీ నడుచుకోకుండా

13ఇశ్రాయేలు రాజుల మార్గాలలో నడచి అహాబు సంతతివారు చేసిన ప్రకారం యూదానూ యెరూషలేము నివాసులనూ వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతానమైన నీ సోదరులను చంపావు.

14కాబట్టి గొప్ప తెగులుతో యెహోవా నీ ప్రజలనూ నీ పిల్లలనూ నీ భార్యలనూ నీ సంపదనంతటినీ దెబ్బ తీస్తాడు.

15నీవు పేగుల్లో ఘోరమైన జబ్బుతో రోగిష్టిగా ఉంటావు. రోజురోజుకూ ఆ జబ్బుతో నీ పేగులు చెడిపోతాయి.>>>

16యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, ఇతియోపియాకు దగ్గరగా ఉన్న అరబీయులను రేపాడు.

17వారు యూదాదేశంపై దాడి చేసి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన సంపదనంతా, అతని కొడుకులనూ భార్యలనూ పట్టుకెళ్ళారు. అతని కొడుకుల్లో చివరి వాడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కొడుకును కూడా విడిచిపెట్టలేదు.

18ఇదంతా జరిగిన తరువాత యెహోవా అతని కడుపులో నయం కాని జబ్బు కలిగించాడు.

19రెండేళ్ళ తర్వాత ఆ జబ్బు ముదిరి అతని పేగులు చెడిపోయి దుర్భరంగా చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వీకులకు చేసిన అంత్యక్రియలు అతనికి చేయలేదు.

20అతడు పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 ఏళ్ళు పాలించి చనిపోయాడు. అతని మృతికి ఎవరూ విలపించలేదు. రాజుల సమాధులలో గాక దావీదు పట్టణంలో వేరే చోట ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 21 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran