Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Chronicles 17 >> 

1ఆసా తరువాత అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యాన్ని బలపరచుకున్నాడు.

2అతడు యూదా దేశంలోని ప్రాకార పురాలన్నిటిలో సైన్యాలను ఉంచి, యూదా దేశంలో తన తండ్రి ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిము పట్టణాల్లో కావలి దండులను ఉంచాడు.

3యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వికుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ

4బయలు దేవుళ్ళను పూజించకుండా తన తండ్రి దేవునిపై ఆధారపడి, ఇశ్రాయేలువారి చర్యల ప్రకారం గాక దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు.

5కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారంతా యెహోషాపాతుకు పన్ను కట్టారు. అతనికి ఐశ్వర్యం, ఘనత, సమృద్ధిగా కలిగింది.

6యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనస్సులో దృఢ నిశ్చయం చేసుకొని, ఉన్నత స్థలాలనూ దేవతా స్తంభాలనూ యూదాలో నుండి తీసివేశాడు.

7తన పాలన మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లోని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే పెద్దలను పంపాడు.

8వారితో షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబదోనీయా అనే లేవీయులనూ, ఎలీషామా, యెహోరాము అనే యజకులనూ పంపించాడు.

9వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకొని యూదావారి మధ్య ప్రకటిస్తూ, యూదా పట్టణాలన్నిటిలో సంచరిస్తూ ప్రజలకు బోధించారు.

10యూదా దేశం చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటి మీదికి యెహోవా భయం రావడం చేత ఎవరూ యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి తెగించలేదు.

11ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్ను, కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను, 7,700 మేకపోతులను సమర్పించేవారు.

12యెహోషాపాతు అంతకంతకూ గొప్పవాడై యూదా దేశంలో కోటలనూ, సామగ్రి నిలవచేసే పట్టణాలనూ కట్టించాడు.

13యూదాదేశపు పట్టణాల్లో అతనికి విస్తారమైన సంపద సమకూడింది. అతని కింద పరాక్రమశాలురు యెరూషలేములో ఉండేవారు.

14వీరి పూర్వీకుల వంశాల ప్రకారం వీరి సంఖ్య. యూదాలో సహస్రాధిపతులకు ప్రధాని అయిన అద్నా దగ్గర 3,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

15అతని తరువాత యెహోహానాను అనే అధిపతి. ఇతని దగ్గర 2,80,000 మంది ఉన్నారు.

16అతని తరువాత జిఖ్రీ కుమారుడు, యెహోవాకు తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొన్న అమస్యా. అతని దగ్గర 2,00,000 మంది పరాక్రమశాలులున్నారు.

17బెన్యామీనీయుల్లో ఎల్యాదా అనే పరాక్రమశాలి ఒకడున్నాడు. ఇతని దగ్గర విల్లు, డాలు, పట్టుకొనేవారు 2,00,000 మంది ఉన్నారు.

18అతని తరువాత యెహోజాబాదు. ఇతని దగ్గర 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.

19రాజు యూదా అంతటిలో ఉన్న ప్రాకార పురాల్లో ఉంచినవారు గాక వీరు రాజు పరివారంలో ఉన్నారు.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 17 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran