Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Chronicles 14 >> 

1అబీయా చనిపోయి తన పూర్వీకులతో కూడా కన్నుమూశాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఇతని రోజుల్లో దేశం 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

2ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడిచాడు.

3అన్యదేవతల బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలాలను పాడుచేసి, ప్రతిమలను పగులగొట్టి, దేవతాస్తంభాలను కొట్టి వేయించాడు.

4వారి పూర్వీకుల దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించాలనీ ధర్మశాస్త్రాన్నీ, ఆజ్ఞలనూ పాటించాలని యూదావారికి ఆజ్ఞాపించాడు.

5ఉన్నత స్థలాలనూ సూర్య దేవతాస్తంభాలనూ యూదా వారి పట్టాణాలన్నిటిలో నుండి తీసివేశాడు. అతని పాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది.

6ఆ సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశం నెమ్మదిగా ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయడం వలన అతడు యూదాదేశంలో ప్రాకారాలు గల పట్టణాల్ని కట్టించాడు.

7అతడు యూదా వారికి ఈ విధంగా ప్రకటన చేశాడు, <<మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణాలను కట్టించి, వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం.>> కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు.

8ఆ కాలంలో యూదా వారిలో డాళ్ళు, ఈటెలు పట్టుకొనే వారు 3,00,000 మంది ఉన్నారు. యూదావారితోనూ, కవచాలు ధరించి బాణాలు వేసే 2,80,000 మంది బెన్యామీనీయులతోనూ కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరంతా పరాక్రమవంతులు.

9ఇతియోపీయా వాడు జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకు వచ్చినపుడు ఆసా అతణ్ణి ఎదుర్కొన్నాడు.

10వారు మారేషా దగ్గర జెపాతా అనే లోయలో ఎదురుగా నిలిచి యుద్ధం చేశారు.

11ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి, <<యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రుల్ని నీ మీద జయం పొందనీయకు>> అని ప్రార్థించాడు.

12అప్పుడు యెహోవా ఆ కూషీయుల్ని ఆసా ఎదుటా, యూదా వారి ఎదుటా నిలబడనియ్యకుండా వారిని దెబ్బ తీసిన కారణంగా వారు పారిపోయారు.

13ఆసా, అతనితో ఉన్నవారూ గెరారు వరకు వారిని తరిమారు. కూషీయులు తిరిగి లేవలేక యెహోవా భయం చేతా ఆయన సైన్యం భయం చేతా పారిపోయారు. యూదా వారు విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకున్నారు.

14గెరారు చుట్టూ ఉన్న పట్టణాల్లోని వారందరి మీదికీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా సైన్యం వాటన్నిటినీ కొల్లగొట్టి, వాటిలో ఉన్న విస్తారమైన సొమ్మంతటినీ దోచుకున్నారు.

15అక్కడి పశువుల శాలల్ని పడగొట్టి, విస్తారమైన గొర్రెల్నీ ఒంటెల్నీ సమకూర్చుకొని యెరూషలేముకు తిరిగి వచ్చారు.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 14 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran