Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  1 John 1 >> 

1ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం.

2ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం.

3మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది.

4మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం.

5దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం.

6మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు.

7అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

8మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.

9కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు.

10మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.


  Share Facebook  |  Share Twitter

 <<  1 John 1 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran