Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  1 Chronicles 20 >> 

1తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు.

2దావీదు వచ్చి, వాళ్ళ రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకున్నాడు. దాని బరువు 34 కిలోగ్రాములు. అందులో విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. దాన్ని దావీదు ధరించాడు. ఇంకా అతడు ఎంతో విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణంలో నుంచి తీసుకుపోయాడు.

3దాని ప్రజలను అతడు బయటకు తీసుకొచ్చి, వాళ్ళతో రంపాలతో, ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో బలవంతంగా పని చేయించాడు. ఈ విధంగా అతడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ చేశాడు. తరువాత దావీదూ, సైన్యమూ, యెరూషలేముకు తిరిగి వచ్చారు.

4అటు తరువాత గెజెరులో ఉన్న ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడు సిప్పయి అనే ఒకణ్ణి హతం చేశాడు. అందువల్ల ఫిలిష్తీయులు లొంగిపోయారు.

5మళ్ళీ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు యాయీరు కొడుకు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపని చేసేవాడి అడ్డ కర్ర అంత పెద్దది.

6మళ్ళీ గాతులో యుద్ధం జరిగింది. చాలా పొడవుగాగా ఉన్న వాడొకడు అక్కడ ఉన్నాడు. అతని చేతులకూ కాళ్ళకు, ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతతికి చెందిన వాడు.

7అతడు ఇశ్రాయేలీయులను దూషించగా దావీదు సోదరుడు షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాడు.

8గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారైన వీరు దావీదు చేత, అతని సేవకుల చేత హతమయ్యారు.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Chronicles 20 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran