Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  1 Chronicles 16 >> 

1ఈ విధంగా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి, దావీదు దాని కోసం వేయించిన గుడారం మధ్యలో దాన్ని ఉంచి, దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించారు.

2దహన బలులు, సమాధాన బలులు దావీదు అర్పించడం ముగించిన తరువాత అతడు యెహోవా పేరట ప్రజలను దీవించాడు.

3పురుషులైనా, స్త్రీలైనా ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికీ ఒక రొట్టె, ఒక మాంసపు ముద్ద, ఒక ఎండిన ద్రాక్షపళ్ళ గుత్తిని పంచిపెట్టాడు.

4అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికీ, కృతజ్ఞత చెల్లించడానికీ, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికీ లేవీయుల్లో కొందరిని నియమించాడు.

5వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాతి వాడు జెకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళు స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయించడానికి నిర్ణయంయామకం జరిగింది. ఆసాపు కంచు తాళాలు వాయించేవాడు.

6బెనాయా, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు.

7ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.

8యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పేరును ప్రకటన చెయ్యండి. ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి.

9ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.

10ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక.

11యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్నిఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.

12ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా,

13ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.

14ఆయన మన దేవుడు యెహోవా. ఆయన తీర్పులు లోకమంతటా జరుగుతున్నాయి.

15అయన తను చేసిన నిబంధనను తాను పలికిన ఆజ్ఞలను వెయ్యి తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు.

16ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనస్సుకు తెచ్చుకుంటాడు.

17యాకోబుకు కట్టడగా ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా ఆయన స్థిరపరిచింది దీనినే.

18అయన మాట ఇచ్చాడు. <<నేను కనాను భూమిని మీకు వారసత్వంగాఇస్తాను.>>

19మీరు లెక్కకు కొద్ది మందిగా ఉన్నప్పుడే, అల్ప సంఖ్యాకులుగా, దేశంలో పరాయివారుగా ఉన్నపుడే ఇలా చెప్పాను.

20వాళ్ళు జనం నుంచి జనానికి, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతున్నప్పుడు,

21ఆయన ఎవరినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించాడు.

22నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దనీ, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనీ చెప్పాడు.

23సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి.

24అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి.

25యెహోవా మహా ఘనత వహించినవాడు. ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. సమస్త దేవతలకంటే ఆయన పూజార్హుడు.

26జాతుల దేవతలన్నీ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు.

27ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి.

28జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి.

29యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యాలు చేత పట్టుకొని ఆయన సన్నిధిలో చేరండి. పవిత్రత అనే ఆభరణాలు ధరించుకొని ఆయన ముందు సాగిలపడండి.

30భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. అప్పుడది స్థిరంగా ఉంటుంది.

31యెహోవా ఏలుతున్నాడని జనాలలో చాటించండి. ఆకాశాలు ఆనందించు గాక. భూమి సంతోషించు గాక

32సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక. పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక. యెహోవా వస్తున్నాడు.

33భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు. వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి.

34యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయనను స్తుతించండి.

35దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు. మమ్మల్ని సమకూర్చు.

36మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు అని ఆయన్ను బతిమాలుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక. ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు.

37అప్పుడు మందసం ముందు నిత్యమూ జరగవలసిన అనుదిన సేవ జరిగించడానికి దావీదు అక్కడ యెహోవా నిబంధన మందసం దగ్గర ఆసాపునూ అతని బంధువులనూ నియమించాడు. ఓబేదెదోమునూ, వాళ్ళ బంధువులైన అరవై ఎనిమిదిమందినీ,

38యెదూతూను కొడుకు ఓబేదెదోమునూ, హోసానూ ద్వారపాలకులుగా నియమించాడు.

39గిబియోనులోని ఎత్తైన స్థలంలో ఉన్న యెహోవా గుడారం మీద, అక్కడ ఉన్న బలిపీఠం మీద, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మవిధులలో రాసి ఉన్న ప్రకారం,

40ఉదయం, సాయంత్రాలలో ప్రతిరోజూ నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించడానికి అక్కడ అతడు యాజకుడైన సాదోకును, అతని బంధువులైన యాజకులను నియమించాడు.

41యెహోవా కృప నిత్యమూ ఉంటుందని ఆయనను స్తుతించడానికి వీళ్ళతోపాటు హేమానునూ, యెదూతూనునూ, పేర్ల క్రమంలో ఉదాహరించిన మరి కొందరిని నియమించాడు.

42బాకాలు ఊదడానికి, కంచు తాళాలను వాయించడానికి, దేవుని గూర్చి పాడదగిన పాటలను వాద్యాలతో వినిపించడానికి వీళ్ళల్లో ఉండే హేమానునూ, యెదూతూనునూ అతడు నియమించాడు. ఇంకా యెదూతూను కొడుకులను అతడు ద్వారపాలకులుగా నియమించాడు.

43తరువాత ప్రజలందరూ తమతమ ఇళ్ళకు వెళ్లిపోయారు. దావీదు తన ఇంటివాళ్ళను దీవించడానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Chronicles 16 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran