1దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు.
2అప్పుడు దావీదు, <<మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకొన్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు>> అని ఆజ్ఞాపించాడు.
3అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.
4అహరోను సంతతి వారిని, లేవీయులను,
5కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని,
6మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని,
7గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్పై మందిని,
8ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని,
9హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని,
10ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మినాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.
11అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మినాదాబు అనే వాళ్ళతో
12<<లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు.
13ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి>> అన్నాడు.
14అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు.
15తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకొన్నారు.
16అప్పుడు దావీదు, <<మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి>> అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు.
17కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరెక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కూషాయాహు కొడుకు ఏతాను,
18వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.
19వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయింది.
20జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అనే వాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయింది.
21ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.
22లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు.
23బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా,
24షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుకవైపు ఉండే సంరక్షకులుగా నియమించారు.
25దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనుంచి తీసుకు రావడానికి ఉత్సాహంతో వెళ్ళారు.
26యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.
27దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు.
28ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.
29కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.