Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  1 Samuel 29 >> 

1అప్పుడు ఫిలిష్తీయుల సైన్యం గుంపుగా వెళ్ళి ఆఫెకులో మకాం చేశారు. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట పక్కన బస చేశారు.

2ఫిలిష్తీయ పెద్దలు తమ సైన్యాన్ని వందమందిగా, వెయ్యిమందిగా సమకూర్చి పథకం ప్రకారం వస్తుంటే, దావీదు, అతని మనుషులు ఆకీషుతో కలిసి సైన్యం వెనుక వైపున వస్తున్నారు.

3ఫిలిష్తీయ సేనానులు <<ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?>> అని ఆకీషును అడిగారు. అతడు, <<ఇన్ని రోజులుగా ఇన్నేళ్ళగా నా దగ్గర ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడు దావీదు ఇతడే కదా. ఇతడు నా దగ్గర చేరినప్పటి నుండి ఈనాటి వరకు ఇతనిలో ఏ తప్పూ నాకు కనిపించలేదు>>అని ఫిలిష్తీయుల సేనానులతో అన్నాడు.

4అందుకు వారు అతని మీద కోపగించి<<ఇతణ్ణి నువ్వు కేటాయించిన స్థలానికి తిరిగి పంపించు. అతడు మనతో కలిసి యుద్ధానికి రాకూడదు, యుద్ధ సమయంలో అతడు మనకు విరోధిగా మారతాడేమో. ఏం చేసి అతడు తన యజమానితో సఖ్యత కుదుర్చుకుంటాడు? మనవాళ్ళ తలలు నరికి తీసుకుపోవడం చేతనే కదా.

5సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందిని హతం చేసారని ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ, పాటలు పాడిన దావీదు ఇతడే కదా>> అని అతనితో అన్నారు.

6ఆకీషు దావీదును పిలిచి, <<యెహోవా మీద ఒట్టు, నువ్వు నిజంగా నీతిమంతుడివిగా ఉన్నావు. సైన్యంలో నువ్వు నాతో కలసి తిరగడం నాకు ఇష్టమే, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి ఇప్పటికీ నీలో ఎలాంటి తప్పూ నాకు కనబడలేదు. అయితే పెద్దలు నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నారు.

7ఫిలిష్తీయ పెద్దల విషయంలో నువ్వు వ్యతిరేకమైనది చేయకుండా ఉండేలా నువ్వు తిరిగి నీ ఇంటికి తిరిగి సుఖంగా వెళ్ళు>> అని చెప్పాడు.

8దావీదు, <<నేనేం చేశాను? నా అధికారివైన రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను రాకుండా ఉండేంత తప్పు నీ దగ్గరికి వచ్చినప్పటినుండి ఈ రోజు వరకు నాలో నీకు ఏమి కనబడింది?>> అని ఆకీషును అడిగాడు.

9అప్పుడు ఆకీషు <<నువ్వు నా కళ్ళకు దేవదూతలాగా కనబడుతున్నావని నాకు తెలుసు. అయితే ఫిలిష్తీయ సేనానులు, ఇతడు మనతో కలసి యుద్ధం చేయడానికి రాకూడదని చెబుతున్నారు.

10కాబట్టి పొద్దున్నే నువ్వూ, నీతో ఉన్న నీ సైనికులు త్వరగా లేచి తెల్లవారగానే బయలుదేరి వెళ్ళిపోవాలి>>అని దావీదుకు ఆజ్ఞ ఇచ్చాడు.

11కాబట్టి దావీదు, అతని ప్రజలు పొద్దున్నే తొందరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలుకు వెళ్లారు.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Samuel 29 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran