1ఒక రోజున సమూయేలు సౌలును పిలిచి ఇలా చెప్పాడు, <<ఇశ్రాయేలు ప్రజలపై నిన్ను రాజుగా అభిషేకించడానికి యెహోవా నన్ను పంపించాడు. ఆయన మాట విను.
2సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, <అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన కీడు నాకు జ్ఞాపకం ఉంది. వారు ఐగుప్తు విడిచి రాగానే మార్గ మధ్యంలో అమాలేకీయులు వారిపైకి వచ్చి దాడి చేశారు కదా.
3కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళి ఎవ్వరి పట్లా కనికరం చూపకుండా అమాలేకీయులను హతం చెయ్యి. పురుషులైనా, స్త్రీలైనా, చిన్నపిల్లలైనా, పసిపిల్లలైనా, ఎద్దులైనా, గొర్రెలైనా, ఒంటెలైనా, గాడిదలైనా వేటినీ విడిచిపెట్టక వారికి ఉన్నదంతా నాశనం చేసి, అమాలేకీయులందరినీ నిర్మూలం చెయ్యి> >> అని చెప్పాడు.
4అప్పుడు సౌలు ప్రజలను తెలాయీములో పోగుచేసి వారిని లెక్కించాడు. కాల్బలం రెండు లక్షలమంది, యూదావారు పదివేలమంది పోగయ్యారు.
5అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి లోయలో పొంచి ఉన్నాడు.
6ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కేనీయులు వారికి సహాయం చేశారు గనుక అమాలేకీయులతో కలసి ఉన్న కేనీయులు కూడా నాశనం కాకుండా ఉండేలా వారిని బయలుదేరి వెళ్ళిపొమ్మని కేనీయులకు సమాచారం పంపినపుడు కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయారు.
7తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గంలో ఉన్న షూరు వరకు తరిమి సంహరించి
8అమాలేకీయుల రాజు అగగును సజీవంగా పట్టుకొని, మిగిలిన వారందరినీ కత్తితో నాశనం చేశాడు.
9సౌలు, అతని ప్రజలు కలసి అగగును, గొర్రెలు, ఎద్దులు, బాగా బలిసిన గొర్రెపిల్లలు మొదలైనవాటిలో మంచివాటినీ నాశనం చేయకుండా వేరుగా ఉంచి, పనికిరాని వాటిని, నాసిరకం వాటిని చంపివేశారు.
10అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైఇలా చెప్పాడు,
11<<సౌలు నేను చెప్పినది చేయకుండా నా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశాడు గనుక అతణ్ణి రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను.>> అప్పుడు సమూయేలు కోపం తెచ్చుకొని రాత్రి అంతా యెహోవాకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు.
12తెల్లవారగానే సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్ళినప్పుడు సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ విజయ స్మారక స్థూపం నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లిపోయాడని తెలుసుకున్నాడు.
13తరువాత అతడు సౌలు దగ్గరకి వచ్చినపుడు సౌలు, <<యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక, యెహోవా చెప్పిన మాట నేను జరిగించాను>> అన్నాడు.
14అప్పుడు సమూయేలు, <<అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు ఎక్కడివి?>> అని అడిగాడు.
15అందుకు సౌలు <<అమాలేకీయుల నుండి ప్రజలు వీటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ప్రజలు గొర్రెల్లో, ఎద్దుల్లో మంచివాటిని చంపకుండా ఉండనిచ్చారు. మిగిలిన వాటన్నిటినీ మేము హతం చేశాం>> అన్నాడు.
16సమూయేలు <<నీవు మాట్లాడవలసిన అవసరం లేదు. యెహోవా రాత్రి నాతో చెప్పిన మాట నీకు చెబుతున్నాను విను>> అన్నాడు. సౌలు, <<చెప్పండి>> అన్నాడు.
17అపుడు సమూయేలు, <<నీ విషయంలో నువ్వు అల్పుడవుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యమైన వాడివయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు.
18యెహోవా నిన్ను పంపించి <నువ్వు వెళ్ళి పాపాత్ములైన అమాలేకీయులను నాశనం చెయ్యి, వారు సమూలంగా అంతమయ్యే వరకూ వారితో యుద్ధం చేయి> అని చెప్పినప్పుడు,
19నువ్వు యెహోవా మాట వినకుండా దోచుకున్న దానిని ఆశించి ఆయన విషయంలో ఎందుకు తప్పు చేశావు?>> అన్నాడు.
20అపుడు సౌలు, <<అలా అనకు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గాన వెళ్ళి అమాలేకీయుల రాజైన అగగును మాత్రమే తీసుకు వచ్చాను కాని అమాలేకీయులందరినీ నాశనం చేశాను.
21అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలు శపితమైన గొర్రెలలో, ఎద్దులలో శ్రేష్టమైనవాటిని తీసుకువచ్చారు>> అని సమూయేలుతో చెప్పాడు.
22అందుకు సమూయేలు, <<ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం.
23తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహపూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను తిరస్కరించాడు>> అన్నాడు.
24అపుడు సౌలు <<ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.
25నువ్వు నా పాపాన్ని తీసివేసి నేను యెహోవాకు మొక్కుకొనేలా నాతో కలసి రా>> అని సమూయేలును వేడుకున్నాడు.
26అయితే సమూయేలు, <<నీతోబాటు నేను వెనక్కి రాను. నీవు యెహోవాను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను తిరస్కరించాడు>> అని చెప్పి
27వెళ్లిపోవాలని వెనక్కి తిరిగాడు. అప్పుడు సౌలు అతని దుప్పటి చెంగును పట్టుకొనగా అది చిరిగింది.
28అప్పుడు సమూయేలు అతనితో ఇలా చెప్పాడు, <<ఈ రోజే యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసి నీ సాటి వారిలో ఉత్తముడైన వేరొకరికి దానిని అప్పగించాడు.
29ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్న దేవుడు అబద్ధమాడడు, మనస్సు మార్చుకోడు.>>
30సౌలు, <<నేను పాపం చేశాను. అయినప్పటికీ నా ప్రజల పెద్దల ముందు, ఇశ్రాయేలీయుల ముందు నన్ను గౌరవించు. యెహోవాకు మొక్కడానికి నేను వెళ్తుండగా నాతో కూడ కలసి రమ్మని>> అతని బతిమాలినప్పుడు
31సమూయేలు సౌలు వెంట వెళ్ళాడు. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత
32సమూయేలు <<అమాలేకీయుల రాజు అగగును నా దగ్గరకు తీసికొని రండి>> అన్నాడు. అగగు ఆనందంగా అతని దగ్గరకి వచ్చి, <<నాకు మరణ శిక్ష తప్పిపోయిందా>> అన్నాడు.
33సమూయేలు, <<నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్టు నీ తల్లికి కూడా స్త్రీలలో సంతానం లేకుండా పోతుంది>> అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధానంలో అగగును ముక్కలుగా నరికివేశాడు.
34తరువాత సమూయేలు రమాకు, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయారు.
35సౌలు బతికినంత కాలం సమూయేలు అతణ్ణి చూసేందుకు వెళ్లలేదు గానీ సౌలును గూర్చి దుఃఖిస్తూ వచ్చాడు. తాను సౌలును ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం చెందాడు.