1తరవాత సీయోను అనే దావీదుపురం నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు రావడానికి సొలొమోను రాజు ఇశ్రాయేలీయుల పెద్దలనూ గోత్రాల నాయకులనూ, అంటే ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలను యెరూషలేములో తన దగ్గరకి పిలిపించాడు.
2కాబట్టి ఇశ్రాయేలీయులంతా ఏతనీము అనే ఏడో నెలలో పండగ కాలంలో సొలొమోను రాజు దగ్గర సమావేశమయ్యారు.
3ఇశ్రాయేలీయుల పెద్దలంతా వచ్చినప్పుడు యాజకులు యెహోవా మందసాన్ని పైకెత్తుకున్నారు.
4ప్రత్యక్ష గుడారాన్ని, గుడారంలో ఉన్న పరిశుద్ధ సామగ్రిని యాజకులు, లేవీయులు తీసుకు వచ్చారు.
5సొలొమోను రాజు, అతని దగ్గర సమావేశమైన ఇశ్రాయేలు సమాజమంతా మందసం ఎదుట నిలబడి, లెక్క పెట్టలేనన్ని గొర్రెలనూ ఎద్దులనూ బలిగా అర్పించారు.
6యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని దాని స్థలంలో, అంటే మందిరం గర్భాలయమైన అతి పరిశుద్ధ స్థలంలో, కెరూబుల రెక్కల కింద ఉంచారు.
7కెరూబుల రెక్కలు మందసం మీదికి చాపుకుని ఉన్నాయి. ఆ కెరూబులు మందసాన్ని, దాని మోత కర్రలనీ కమ్ముకుని ఉన్నాయి.
8ఆ మోత కర్రల కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలంలోకి కనబడేటంత పొడవుగా ఉన్నప్పటికీ అవి బయటికి కనబడలేదు. అవి ఈ రోజు వరకు అక్కడే ఉన్నాయి.
9ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తరవాత యెహోవా వారితో నిబంధన చేసినపుడు హోరేబులో మోషే ఆ పలకలను మందసంలో ఉంచాడు. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరేమీ లేవు.
10యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరాన్ని నింపింది.
11కాబట్టి యెహోవా మహిమ తేజస్సు ఆయన మందిరంలో నిండిపోయి ఆ మేఘం వలన యాజకులు సేవ చేయడానికి నిలబడ లేకపోయారు.
12సొలొమోను దానిని చూసి, <<గాఢాంధకారంలో నేను నివాసం చేస్తానని యెహోవా చెప్పాడు.
13అయితే నేను ఒక గొప్ప మందిరం కట్టించాను, నీవు ఎల్లకాలం నివసించడానికి నేనొక స్థలం ఏర్పాటు చేశాను>> అన్నాడు.
14తరవాత అతడు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజమంతా నిలబడి ఉండగా వారిని ఈ విధంగా దీవించాడు,
15<<నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక.
16<నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి రప్పించినప్పటి నుండి నా నామం నిలిచి ఉండేలా ఇశ్రాయేలీయుల గోత్రాలకు చెందిన ఏ పట్టణంలో నైనా మందిరం కట్టించాలని నేను కోరలేదు. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజ్యపాలన చేయడానికి దావీదును ఎన్నుకొన్నాను> అని ఆయన ప్రకటించాడు.
17ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలని నా తండ్రి అయిన దావీదు కోరుకున్నాడు.
18కాని యెహోవా నా తండ్రి అయిన దావీదుతో చెప్పిందేమంటే, <నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నీవు కోరుకున్నావు. నీ కోరిక మంచిదే.
19అయినా మందిరాన్ని నీవు కట్టించకూడదు. నీ కడుపులో నుండి పుట్టబోయే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఆ మందిరాన్ని కట్టిస్తాడు.>
20ఆయన చెప్పిన మాట యెహోవా నెరవేర్చాడు. నేను నా తండ్రి అయిన దావీదు స్థానంలో నియామకం పొంది, యెహోవా వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలీయుల మీద రాజునై, వారి దేవుడు యెహోవా నామ ఘనత కోసం మందిరాన్ని కట్టించాను.
21అందులో యెహోవా నిబంధన మందసానికి స్థలం ఏర్పాటు చేశాను. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పూర్వీకులను రప్పించినప్పుడు ఆయన వారితో చేసిన నిబంధన అందులోనే ఉంది.>>
22ఇశ్రాయేలీయుల సమాజమంతా చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఇలా అన్నాడు,
23<<యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, పైన ఉన్న ఆకాశంలో, కింద ఉన్న భూమిపై నీలాంటి దేవుడు ఒక్కడూ లేడు. పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడిచే నీ దాసుల విషయంలో నీవు నీ నిబంధనను నెరవేరుస్తూ కనికరం చూపుతూ ఉంటావు.
24నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచి, నీవిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చావు.
25యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, <నీవు ఏవిధంగా నా ఎదుట నడుచుకున్నావో అదే విధంగా నీ సంతానం మంచి నడవడి కలిగి, నా ఎదుట నడుచుకుంటే నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ కుటుంబంలో ఉండక మానడు> అని వాగ్దానం చేశావు. ఇప్పుడు నీవు నీ వాగ్దానాన్ని స్థిరపరచు.
26ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుతో నీవు చెప్పిన మాటను నిశ్చయం చెయ్యి.
27వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సహితం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది?
28అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు.
29నీ దాసుడినైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా <నా నామం అక్కడ ఉంటుంది> అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కన్నులు రాత్రీ, పగలూ తెరచుకుని ఉంటాయి గాక.
30నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు.
31ఎవరైనా తన పొరుగువాడికి అన్యాయం చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించాల్సి వస్తే అతడు ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుట ఆ ప్రమాణం చేసినప్పుడు,
32నీవు ఆకాశం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చి, హాని చేసినవాడి తల మీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున అతనికిచ్చి అతని నీతిని నిర్ధారించు.
33నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన తమ శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు నీ వైపు తిరిగి నీ పేరును ఒప్పుకొని ఈ మందిరంలో నీకు ప్రార్థనా విజ్ఞాపనలు చేసినప్పుడు
34నీవు ఆకాశం నుండి విని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించు.
35వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకొని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
36నీవు ఆకాశం నుండి విని, నీ దాసులు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడుచుకోవలసిన మార్గాన్ని వారికి చూపించి, వారికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించు.
37దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా,
38నీ ప్రజలైన ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు గనక ఒక్కడు గానీ ప్రజలందరూ గానీ ఈ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే
39ప్రతి మనిషి హృదయమూ నీకు తెలుసు కాబట్టి నీవు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి విని, క్షమించి, దయచేసి ఎవరు చేసిన దానిని బట్టి వారికి ప్రతిఫలమిచ్చి
40మా పూర్వీకులకు నీవు దయ చేసిన దేశంలో ప్రజలు జీవించినంత కాలం, వారు ఈ విధంగా నీవంటే భయభక్తులు కలిగి ఉండేలా చెయ్యి. మానవులందరి హృదయాలూ నీకు మాత్రమే తెలుసు.
41నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని పరదేశులు నీ పేరును బట్టి దూర దేశం నుండి వచ్చి
42నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే
43నీ నివాసమైన ఆకాశం నుండి నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొన్న విధంగా సమస్తం అనుగ్రహించు. అప్పుడు లోకంలోని ప్రజలంతా నీ పేరును తెలుసుకుని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాగానే నీలో భయభక్తులు కలిగి, నేను కట్టించిన ఈ మందిరానికి నీ పేరు పెట్టామని తెలుసుకుంటారు.
44నీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు పంపించే ఏ స్థలానికైనా బయలు దేరినప్పుడు, నీవు కోరుకొన్న పట్టణం వైపుకూ నీ నామ ఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపుకూ తిరిగి యెహోవావైన నీకు ప్రార్థన చేస్తే,
45ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి.
46పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు,
47వారు చెరగా వెళ్ళిన దేశంలో తాము చేసిన దానిని జ్ఞాపకం చేసుకుని, <మేము దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాము> అని చింతించి, పశ్చాత్తాపపడి నీకు విన్నపం చేస్తే,
48వారు చెరలో ఉన్న దేశం నుండి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ వైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకు దయచేసిన దేశం వైపూ, నీవు కోరుకున్న పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ తిరిగి నీకు ప్రార్థన చేస్తే,
49నీ నివాసమైన ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలు విని వారి పని జరిగించు.
50నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు.
51వారు నీవెన్నుకున్న నీ ప్రజలు. ఇనుప కొలిమి నుండి తప్పించినట్టుగా నీవు ఐగుప్తు దేశంలోనుండి తప్పించిన నీ ప్రజలు.
52కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు.
53ప్రభువా, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.>>
54సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం, విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళపై నుండి లేచి నిలబడ్డాడు.
55అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు,
56<<తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.
57కాబట్టి మన దేవుడు యెహోవా మనల్ని విడిచి పెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి
58తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకొనేలా, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా, మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక.
59ఆయన తన దాసుడినైన నా కార్యాన్ని, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కార్యాన్ని అనుదిన అవసరత ప్రకారం, జరిగించేలా నేను యెహోవా ఎదుట వేడుకొన్న ఈ మాటలు రాత్రీ పగలూ మన దేవుడు యెహోవా సన్నిధిలో ఉంటాయి గాక.
60అప్పుడు లోకం లోని ప్రజలంతా యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ తెలుసుకుంటారు.
61కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోడానికి, ఈ రోజున ఉన్నట్టు ఆయన చేసిన నిర్ణయాలను పాటించడానికి, మీ హృదయం మీ దేవుడు యెహోవా విషయంలో యథార్థంగా ఉంటుంది గాక.>>
62అప్పుడు రాజు, అతనితో కూడ ఇశ్రాయేలీయులంతా యెహోవా సన్నిధిలో బలులు అర్పిస్తుండగా
63సొలొమోను 22,000 ఎద్దులను, 1,20,000 గొర్రెలను, యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులంతా కలిసి యెహోవా మందిరాన్ని ప్రతిష్టించారు.
64ఆ రోజు ఆ దహనబలులు, నైవేద్యాలు, సమాధాన బలి పశువుల కొవ్వుని అర్పించడానికి యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠం సరిపోలేదు. కాబట్టి రాజు యెహోవా మందిరం ఎదుట ఉన్న ఆవరణ మధ్య ఉన్న స్థలాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహన బలులు నైవేద్యాలు, సమాధానబలి పశువుల కొవ్వు అర్పించాడు.
65ఆ సమయంలో సొలొమోను, అతనితో కూడ ఇశ్రాయేలీయులంతా హమాతుకు పోయే దారి మొదలు ఐగుప్తు నది వరకు ఉన్న ప్రాంతాలన్నిటి నుండి వచ్చిన ఆ మహా జన సమూహం రెండు వారాలు, అంటే 14 రోజులు యెహోవా సన్నిధిలో పండగ చేశారు.
66ఎనిమిదో రోజు అతడు ప్రజలను అనుమతించగా వారు రాజును ప్రశంసించి యెహోవా తన దాసుడైన దావీదుకూ తన ప్రజలైన ఇశ్రాయేలీయులకూ చేసిన మేళ్లను బట్టి సంతోషిస్తూ ఆనంద భరితులై తమ తమ నివాసాలకు తిరిగి వెళ్ళారు.