Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  1 Kings 11 >> 

1సొలొమోను రాజు చాలామంది విదేశీ స్త్రీలను అంటే ఫరో కూతుర్నిమాత్రమే గాక మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ మొదలైన జాతి స్త్రీలను మోహించి పెళ్ళిచేసుకున్నాడు.

2<<ఈ ప్రజలు మీ హృదయాలను కచ్చితంగా తమ దేవతలవైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు.>>అయితే సొలోమోను ఈ స్త్రీలను మోహించాడు.

3అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు.

4సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతలవైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా దేవుని పట్ల యథార్ధంగా లేదు.

5సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు.

6ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థహృదయంతో యెహోవాను అనుసరించలేదు.

7సొలొమోను కెమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మొలెకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు.

8తన విదేశీ భార్యలు వారి విగ్రహాలకు ధూపం వేస్తూ బలులు అర్పించడం కోసం అతడు ఇలా చేశాడు.

9ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా అతనికి రెండు సార్లు ప్రత్యక్షమై,

10నీవు ఇతర దేవతలను అనుసరించకూడదని అతనికి ఆజ్ఞాపించాడు. అయినా సొలొమోను హృదయం ఆయన నుండి తొలగిపోయింది. యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞను అతడు పాటించనందుకు అయన అతనిపై కోపగించి ఇలా చెప్పాడు.

11<<నేను నీతో చేసిన నా నిబంధనను, శాసనాలను నీవు ఆచరించడం లేదు. కాబట్టి ఈ రాజ్యం కచ్చితంగా నీకు ఉండకుండా తీసివేసి నీ సేవకుల్లో ఒకడికి ఇచ్చి తీరుతాను.

12అయినా నీ తండ్రి దావీదు కోసం నీ రోజుల్లో అలా చెయ్యను. నీ తరువాత నీ కొడుకు చేతిలోనుండి దానిని తీసివేస్తాను.

13రాజ్యమంతా తీసివేయను. నా దాసుడు దావీదు కోసం, నేను కోరుకొన్న యెరూషలేము కోసం ఒక్క గోత్రం నీ కొడుక్కి ఇస్తాను.>>

14యెహోవా ఎదోమువాడు హదదు అనే ఒకణ్ణి సొలొమోనుకు విరోధిగా లేపాడు. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.

15గతంలో దావీదు ఎదోము దేశం మీద యుద్ధం చేస్తూ ఉంటే, హతమైన వాళ్ళను పాతిపెట్టించ డానికి సైన్యాధిపతి యోవాబు వెళ్ళాడు.

16ఎదోములోని మగవారందరినీ చంపేసే వరకు ఇశ్రాయేలీయులందరితో పాటు యోవాబు ఆరు నెలలు అక్కడే ఉన్నాడు.

17అప్పుడు హదదు చిన్నవాడు. అతడూ అతనితో పాటు అతని తండ్రి సేవకులలో కొంతమంది ఎదోమీయులూ ఐగుప్తు దేశానికి పారిపోయారు.

18వాళ్ళు మిద్యాను దేశం నుండి బయలు దేరి పారాను ప్రాంతానికి వచ్చి, అక్కడినుంచి కొందరిని వెంటబెట్టుకుని ఐగుప్తు రాజు ఫరో దగ్గరకు వెళ్ళారు. ఫరో అతనికి ఇల్లు, భూమి ఇచ్చి ఆహారం ఏర్పాటు చేశాడు.

19హదదు ఫరో దృష్టిలో చాలా మెప్పు పొందాడు. ఫరో తన భార్య తహపనేసు సోదరిని అతనికిచ్చి పెళ్లి చేసాడు.

20ఈ తహపనేసు సోదరి హదదుకు గెనుబతు అనే కొడుకుని కన్నది. ఫరో ఇంట్లో తహపనేసు ఇతన్ని పెంచింది, కాబట్టి గెనుబతు ఫరో అంతఃపురంలోనే ఫరో పిల్లలతోపాటు పెరిగాడు.

21దావీదు తన పుర్వికులతో కన్నుమూశాడని, అతని సైన్యాధిపతి యోవాబు చనిపోయాడని ఐగుప్తు దేశంలో హదదు విన్నాడు. అతడు <<నేను నా స్వదేశానికి వెళ్లడానికి సెలవివ్వండి>> అని ఫరోతో మనవి చేశాడు.

22ఫరో, <<నీవు నీ స్వదేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నాదగ్గర నీకేం తక్కువయింది?>> అని అడిగాడు. అందుకు హదదు, <<నాకేమీ తక్కువ కాలేదు, కానీ మీరు నన్ను తప్పక వెళ్లనివ్వండి>> అన్నాడు.

23దేవుడు సొలోమోను మీదికి ఎల్యాదా కొడుకు రెజోను అనే ఇంకొక విరోధిని లేపాడు. ఇతడు సోబా రాజు హదదెజరు అనే తన యజమాని దగ్గరనుండి పారిపోయినవాడు.

24దావీదు సోబా వారిని చంపిన తరువాత రెజోను కొందరిని పోగుచేసుకుని, ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వారంతా దమస్కు వచ్చి అక్కడ నివసించారు. రెజోను దమస్కులో రాజయ్యాడు.

25హదదు చేసిన ఈ కీడే గాక సొలొమోను బతికిన రోజులన్నీ రెజోను ఇశ్రాయేలీయులకు విరోధిగా ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీయుల్ని ద్వేషించాడు. ఇతడు అరాము దేశాన్ని పాలించాడు.

26సొలొమోను సేవకుడు యరొబాము కూడా రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు జెరేదాకు చెందిన ఎఫ్రాయీము గోత్రికుడు నెబాతు కొడుకు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు.

27ఇతడు రాజు మీదికి లేవడానికి కారణం ఇది. సొలొమోను మిల్లోను కట్టించి తన తండ్రి దావీదు పుర ప్రాకారానికి వచ్చిన బీటలు బాగు చేయించాడు.

28యరొబాము మహా బలశాలి. యువకుడైన ఇతడు పనిలో శ్రద్ధ గలవాడని సొలొమోను గ్రహించి, యోసేపు వంశం వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు.

29ఆ సమయంలో యరొబాము యెరూషలేములోనుండి బయటికి వెళ్ళగా షిలోనీయుడూ ప్రవక్త అయిన అహీయా అతన్ని దారిలో కలుసుకున్నాడు. అహీయా కొత్తబట్టలు కట్టుకుని ఉన్నాడు. వారిద్దరు తప్ప పొలంలో ఇంకా ఎవరూ లేరు.

30అప్పుడు అహీయా తాను వేసుకున్న కొత్త బట్ట చించి పన్నెండు ముక్కలు చేసి, యరొబాముతో ఇలా అన్నాడు, <<ఈ పది ముక్కలు నీవు తీసుకో.

31ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేంటంటే ప్రజలు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అనే సీదోనీయుల దేవతకు, కెమోషు అనే మోయాబీయుల దేవుడికి, మిల్కోము అనే అమ్మోనీయుల దేవుడికి మొక్కుతున్నారు.

32సొలొమోను తండ్రి దావీదు లాగా వాళ్ళు నా విధానాలను అనుసరించి నడవలేదు. నా దృష్టిలో సరిగా ప్రవర్తించలేదు. నా శాసనాలను ఆచరణలో పెట్టలేదు. కాబట్టి సొలొమోను చేతిలోనుండి రాజ్యాన్ని తీసేసి పది గోత్రాలను నీకిస్తాను.

33అయితే నా సేవకుడైన దావీదు కోసం, నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణం కోసం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి అతనికి ఒక గోత్రం ఉండనిస్తాను.

34రాజ్యాన్ని సొలోమోను చేతిలోనుండి బొత్తిగా తీసివేయను. నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను, కట్టడలను ఆచరించాడు కాబట్టి దావీదును జ్ఞాపకం చేసికొని తన జీవితకాలమంతా అతన్ని పరిపాలన చేయనిస్తాను.

35అయితే అతని కొడుకు చేతిలోనుండి రాజ్యాన్ని తీసివేసి అందులో నీకు పది గోత్రాలు ఇస్తాను.

36నా పేరు అక్కడ ఉండేలా నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా సమక్షంలో నా సేవకుడైన దావీదుకోసం ఒక దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. అందువల్ల అతని కొడుక్కి ఒక గోత్రం ఇస్తాను.

37నేను నిన్ను ఎన్నుకుంటాను. నీవు కోరే దానంతటిమీదా పరిపాలిస్తూ ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉంటావు.

38నా సేవకుడైన దావీదు నా కట్టడలను నా ఆజ్ఞలను పాటించినట్లు, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని, నా మార్గాలను అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరచినట్లు నిన్ను కూడా స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు ఇస్తాను.

39నేను దావీదు సంతానాన్ని వారు చేసిన అపరాధం మూలంగా శిక్షిస్తాను గానీ ఎల్లకాలం అలా చేయను.>>

40సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయి, ఐగుప్తు రాజు షీషకు దగ్గర చేరి సొలొమోను చనిపోయే వరకు ఐగుప్తులోనే ఉన్నాడు.

41సొలొమోను గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా అతని జ్ఞానం గురించి, సొలొమోను చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

42సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరినీ పాలించిన కాలం 40 ఏళ్ళు.

43సొలొమోను చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని తండ్రి దావీదు పురంలో అతన్ని పాతిపెట్టారు. తర్వాత అతని కొడుకు రెహబాము అతనికి బదులు రాజయ్యాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Kings 11 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran