Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  1 Corinthians 14 >> 

1ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి.

2ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు.

3అయితే దైవసందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి, ఆదరణ, ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు.

4భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు.

5మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దైవసందేశం ప్రకటించేవారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడి కంటే (అర్థం చెబితే తప్ప) దేవుని పక్షంగా దేవుడు తెలియ చేసిన సందేశాన్ని ప్రకటించే వాడే గొప్పవాడు.

6సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి?

7నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది?

8బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?

9అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్థమౌతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా!

10లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి.

11మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకూ, నాకు అతడూ పరాయివారంగా ఉంటాం.

12మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తిగలవారు గనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను కోరుకొని వాటిలో అమితంగా అభివృద్ధి చెందండి.

13కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి.

14నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు.

15కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను.

16అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్‌” అని చెప్పలేడు కదా!

17నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు.

18దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను.

19అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది.

20సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి.

21ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, “తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు.”

22కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన.

23సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా?

24అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది.

25అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.

26సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి.

27ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే, ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా, ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్థం చెప్పాలి.

28అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో, దేవునితో మాట్లాడుకోవచ్చు.

29ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి.

30అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి.

31అందరూ నేర్చుకొనేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకడి తరవాత ఒకడు దేవుడిచ్చిన సందేశం ప్రకటించ వచ్చు.

32ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి.

33ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో

34స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది.

35వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానకరం.

36ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా?

37ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తిననీ భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు కచ్చితంగా తెలుసుకోవాలి.

38ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి.

39కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి.

40అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Corinthians 14 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran