Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Revelation 10 >> 

1మహా బలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై ఇంద్ర ధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.

2ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరచి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రంపైనా ఎడమకాలు భూమిపైనా ఉంచాడు.

3తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి.

4ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తరువాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి “ఏడు ఉరుములు పలికిన విషయాలను రహస్యంగా ఉంచు. వాటిని రాయవద్దు” అంటూ నాకొక స్వరం వినిపించింది.

5అప్పుడు సముద్రంమీదా భూమిమీదా నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు.

6పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. “ఇక ఆలస్యం ఉండదు.

7ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది.”

8అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం మళ్లీ, “సముద్రం పైనా భూమిపైనా నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో” అని నాకు చెప్పాడు.

9నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన, “ఈ పత్రం తీసుకుని తిను. అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది. నీ నోటికి మాత్రం అది తేనెలా తియ్యగా ఉంటుంది” అన్నాడు.

10అప్పుడు నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది.

11అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు. “నువ్వు అనేకమంది ప్రజలను గూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి.”



 <<  Revelation 10 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran