Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 92 >> 

1యెహోవాకు కృతఙ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.

2ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.

3పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.

4ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను.

5యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి.

6పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.

7దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!

8అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.

9యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.

10అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు.

11నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి.

12నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.

13వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.

14యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.

15ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.



 <<  Psalms 92 >> 


Bible2india.com
© 2010-2026
Help
Single Panel

Laporan Masalah/Saran