Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 64 >> 

1దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు.

2దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.

3ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు.

4నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు.

5వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహపరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనల్ని ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు.

6వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి.

7దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.

8వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.

9మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు.

10నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.



 <<  Psalms 64 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran