Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 62 >> 

1నా ప్రాణం దేవుని కోసం మౌనంగా కనిపెడుతున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.

2ఆయనే నా ఆశ్రయదుర్గం. నా రక్షణకర్త. నాఎత్తైన గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు.

3ఎన్నాళ్లు మీరంతా ఒక్క మనిషిపై దాడి చేస్తారు? ఒకడు ఒరిగిపోయే గోడను, పడిపోతున్న కంచెను కూలదోసినట్టు మీరంతా ఎంతకాలం ఒక్కణ్ణి కూలదోయాలని చూస్తారు?

4గౌరవప్రదమైన స్థానం నుండి అతణ్ణి పడదోయడానికే వారు అతనితో ఆలోచిస్తారు. అబద్ధాలు చెప్పడం వారికి సంతోషం. వారు తమ నోటితో దీవెనలు పలుకుతూ వారి హృదయాల్లో మాత్రం అతన్ని శపిస్తారు.

5నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.

6ఆయనే నా ఆధార శిల, నా రక్షణ. ఎత్తైన నా గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు

7దేవునిలోనే నా రక్షణ, నా మహిమ. నా బలమైన దుర్గం, నా ఆశ్రయం ఆయనలోనే ఉన్నాయి.

8ప్రజలారా, ఆయనలో నిరంతరం నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయం.

9నిజానికి తక్కువ స్థాయి మనుషులు ఎందుకూ పనికిరానివారు. గొప్పవారేమో మాయలాంటివారు. త్రాసులో వారంతా తేలిపోతారు. వారందరినీ కలిపి తూచినా వారు గాలికన్నా తేలికగా ఉన్నారు.

10బలాత్కారంలో, దోచుకోవడంలో నమ్మకం పెట్టుకోవద్దు. ఐశ్వర్యంలో వ్యర్ధంగా మనసు నిలపవద్దు. ఎందుకంటే అవేవీ ఫలించవు.

11ప్రభావం తనదే అని దేవుడు ఒకసారి చెప్పాడు. రెండుసార్లు నేనా మాట విన్నాను.

12కృప చూపడం నీకే చెల్లుతుంది. ఎందుకంటే ప్రభూ, మనుష్యులందరికీ వారు చేసిన క్రియల ప్రకారం నువ్వే ప్రతిఫలమిస్తున్నావు.



 <<  Psalms 62 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran