Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Job 27 >> 

1యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు.

2నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు.

3నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు,

4నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.

5మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రం ఒప్పుకోను. మరణమయ్యే దాకా నేనెంత మాత్రం యథార్థతను వదిలి పెట్టను.

6నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు.

7నాకు శత్రువులు దుష్టులుగా కనబడతారు గాక. నన్నెదిరించేవారు నీతి లేని వారుగా కనబడతారు గాక.

8దేవుడు అతణ్ణి కొట్టి వేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది?

9వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా?

10వాడు సర్వశక్తుడిలో ఆనందిస్తాడా? వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడా?

11దేవుని హస్తాన్ని గూర్చి నేను మీకు ఉపదేశిస్తాను. సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను.

12మీలో ప్రతివాడూ దాని చూశాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని తలపోస్తూ ఉంటారు?

13దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే. బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే.

14వారి పిల్లలు సంఖ్యలో విస్తరిస్తే అది కత్తివాత కూలడానికే గదా. వారి సంతానానికి చాలినంత ఆహారం దొరకదు.

15వారికి మిగిలిన వారు తెగులు మూలంగా చచ్చి సమాధి అవుతారు. వారి వితంతువులు వారి విషయం రోదనం చెయ్యరు.

16ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినా బంక మట్టి అంత విస్తారంగా వస్త్రాలు సిద్ధం చేసుకున్నా,

17వారు అలా సిద్ధపరచుకుంటారే గానీ నీతిమంతులు వాటిని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుంటారు.

18వారు పురుగుల గూళ్లవంటి ఇళ్ళు కట్టుకుంటారు కావలివాడు కట్టుకునే గుడిసె లాంటి ఇళ్ళు వారు కట్టుకుంటారు.

19అతడు ధనికుడుగా పడుకుంటాడు గానీ అది కొనసాగదు. అతడు కళ్ళు తెరవగానే మొత్తం పోతుంది.

20భయాలు జలప్రవాహంలాగా వారిని తరిమి పట్టుకుంటాయి. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుపోతుంది.

21తూర్పు గాలి అతణ్ణి ఎగరగొడుతుంది. వాడు ఇక ఉండడు. అది అతని స్థలంలో నుండి అతణ్ణి ఊడ్చివేస్తుంది.

22ఆగకుండా అది అతని మీద విసిరి కొడుతుంది. వాడు దాని చేతిలోనుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాడు.

23అది వాణ్ణి చూసి హేళనగా చప్పట్లు కొడుతుంది. వాడున్న చోటు నుండి వాణ్ణి ఈసడింపుగా తోలివేస్తుంది.



 <<  Job 27 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran