Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Job 26 >> 

1అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.

2శక్తి లేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు! బలం లేని చేతిని ఎంత బాగా రక్షించావు!

3జ్ఞానం లేని వాడికి నీ వెంత చక్కగా ఆలోచన చెప్పావు! సంగతిని ఎంత చక్కగా వివరించావు!

4నువ్వు ఎవరి ఎదుట మాటలు పలికావు? ఎవరి ఆత్మ నీలోనుండి బయలుదేరింది?

5బిల్దదు ఇలా అన్నాడు. జలాల కింద నివసించే వారు, మృతులు, నీడలు వణికిపోతారు.

6ఆయన దృష్టికి పాతాళం తెరిచి ఉంది. నాశనకూపం ఆయన ఎదుట బట్టబయలుగా ఉంది.

7ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు.

8ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలి పోవడం లేదు.

9దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు.

10వెలుగు చీకటులమధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు.

11ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి.

12తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు. తన వివేకం వలన రాహాబును నలగగొడతాడు.

13ఆయన ఊపిరి వదలగా ఆకాశ విశాలాలకు అందం వస్తుంది. ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది.

14ఇవి ఆయన కార్యాల్లో స్వల్పమైనవి. ఆయన్ను గూర్చి మనకు వినబడుతున్నది ఎంతో మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేసే ఆయన మహాబలం ఎంతో గ్రహించగలవాడెవడు?



 <<  Job 26 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran