Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Job 11 >> 

1అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు,

2ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా?

3నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవ్వరూ నిన్ను మందలించకూడదా?

4నువ్వు దేవునితో<<నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను>> అంటున్నావు గదా.

5నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది.

6ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞాన పూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగినదాని కంటే తక్కువ సంజాయిషీయే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో.

7దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా?

8నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళంకంటే లోతుగా ఉన్నది.

9దాని కొలత భూమికంటే పొడవు, దాని వెడల్పు సముద్రంకన్నా విశాలం.

10ఆయన సంచారం చేస్తూ ఒకణ్ణి బంధించి, తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు?

11పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు.

12అయితే అడవి గాడిదపిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు.

13నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు.

14నీ చేతిలో చెడుతనం ఉన్నాడని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు.

15అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకం లేనివాడవై నిర్భయంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటావు.

16తప్పకుండా నువ్వు నీ గడ్డుకాలాన్ని మరచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తు పెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తు చేసుకుంటావు.

17అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది.

18నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది. కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు.

19ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు.

20దుర్మార్గుల కంటిచూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయమూ దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.



 <<  Job 11 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran