Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Chronicles 16 >> 

1ఆసా పరిపాలనలో 36 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయెషా యూదావారి మీద దండెత్తి వచ్చి యూదా రాజు ఆసా దగ్గరికి రాకపోకలు జరగకుండేలా రమా పట్టణాన్ని కట్టించాడు.

2ఆసా యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ఖజానాల్లోని వెండి బంగారాలను తీసి, దమస్కులో నివసించే ఆరాము రాజు బెన్హదదు దగ్గరకి దూతల చేత పంపించాడు.

3<<నా తండ్రికీ నీ తండ్రికీ ఉన్నట్టు నాకూ నీకూ సంధి ఉంది. వెండిని, బంగారాన్ని నీకు పంపించాను. ఇశ్రాయేలు రాజు బయెషా నన్ను విడిచి వెళ్ళిపోయేలా నువ్వు అతనితో చేసుకున్న సంధిని రద్దు చేసుకో>> అని అడిగాడు.

4బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యాల అధిపతుల్ని ఇశ్రాయేలు వారి పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్మాయీము పట్టణాలపై, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లపై దాడి చేశారు.

5బయెషా అది విని రమా ప్రాకారాలను కట్టించడం మానేసి ఆ పని చాలించాడు.

6అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చాడు. వెళ్లి బయెషా కట్టిస్తున్న రమా పట్టణపు రాళ్లను, దూలాలను తీసుకువచ్చారు. ఆసా వాటిని గెబ, మిస్పా పట్టణాలను ప్రాకార కట్టించడానికి వినియోగించాడు.

7ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. <<నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరాము రాజును నమ్ముకున్నావే. అందుకనే ఆరాము రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకు పోయింది.

8ఇంతకు ముందు లెక్క లేనన్ని రథాలు, గుర్రపు రౌతులు గల ఇతియోపీయులు, లూబీయులు గొప్ప సైన్యంగా వచ్చారు గదా? అయినా నువ్వు యెహోవాను నమ్ముకోవడం వలన ఆయన వారిని నీ వశం చేశాడు.

9తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటినుండి నీకు అన్నీ యుద్ధాలే.>>

10ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.

11ఆసా చేసిన పనులన్నిటిని గూర్చి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.

12ఆసా తన పాలనలో 39 వ సంవత్సరంలో అతనికి పాదాలలో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యుల్ని నమ్ముకున్నాడు.

13ఆసా తన పూర్వీకులతో కన్నుమూసి తన పాలనలో 41 వ సంవత్సరంలో చనిపోయాడు.

14ప్రజలు నిపుణత గలవారు సిద్ధం చేసిన సుగంధ, పరిమళ ద్రవ్యాలతో నిండిన పాడె మీద అతణ్ణి ఉంచారు. దావీదు పట్టణంలో అతడు తన కోసం తొలిపించుకొన్న సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని గౌరవార్థం గొప్ప అగ్నిజ్వాల రగిలించారు.



 <<  2 Chronicles 16 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran