Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  1 Corinthians 13 >> 

1నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను.

2దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే.

3పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

4ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

5అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

6ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

7అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

8ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

9ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము.

10అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి.

11నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.

12అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.

13ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.



 <<  1 Corinthians 13 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran