Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Isaiah 35 >> 

1అడవులు, ఎండిన భూములు సంతోషిస్తాయి. ఎడారి సంతోషంతో గులాబీ పువ్వులాగా పూస్తుంది.

2అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది. దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి.

3బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి.

4బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. <<భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్ములను రక్షిస్తాడు.>>

5గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి.

6కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి.

7ఎండమావులు నీటి మడుగులు అవుతాయి. ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుడతాయి. నక్కలు పండుకొనే నివాసాల్లో జమ్ము, తుంగగడ్డి, మేత పుడతాయి.

8పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు. దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు.

9అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు. విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు.

10నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.


  Share Facebook  |  Share Twitter

 <<  Isaiah 35 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran