Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Jeremiah 51 >> 

1యెహోవాా ఇలా చెప్తున్నాడు. <<చూడండి! బబులోనుకూ, లేబ్ కమాయ్ లో నివసించే వాళ్లకూ వ్యతిరేకంగా ప్రచండమైన గాలులనూ, నాశనం చేసే ఆత్మనూ రేపబోతున్నాను.

2విదేశీయులను బబులోనుకు పంపిస్తాను. వాళ్ళు ఆమెను చెదరగొడతారు. ఆమెను సర్వనాశనం చేస్తారు. వినాశనం జరిగే రోజున వాళ్ళు నాలుగు దిక్కులనుండి ఆమెకు విరోధంగా వస్తారు.

3బాణాలు వేసే వాళ్ళకు అవకాశమివ్వకండి. ఆయుధం ధరించే వాణ్ణి నిరోధించండి. దేశంలోని యువకులని వదిలి పెట్టకండి. ఆమె సైన్యాన్నంతటినీ నిర్మూలం చేయండి.

4గాయపడిన వాళ్ళు కల్దీయుల దేశంలో కూలిపోవాలి. వీధుల్లో చనిపోయిన వాళ్ళను పడవేయాలి.

5తమ దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా చేసిన అపరాధాలతో నిండిపోయినప్పటికీ, సేనల ప్రభువూ, తమ దేవుడూ అయిన యెహోవా యూదా ప్రజలనూ, ఇశ్రాయేలు ప్రజలనూ విడిచిపెట్టలేదు.

6బబులోనులో నుండి పారిపోండి. ప్రతి ఒక్కడూ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. దాని పాపానికి పడే శిక్షలో మీరు నాశనం కావద్దు. ఇది యెహోవాా ప్రతీకారం చేసే కాలం. ఆమెకు తన పనులను బట్టి ఆయన తిరిగి చెల్లిస్తాడు.

7బబులోను యెహోవాా చేతిలో ఉన్న బంగారు పాత్ర. ఆ పాత్రలోని మద్యాన్ని ఆయన సర్వలోకానికీ తాగించాడు. లోకంలోని జనాలు ఆమె చేతి మద్యాన్ని తాగి పిచ్చివాళ్ళు అయ్యారు.

8బబులోను అకస్మాత్తుగా కూలిపోతుంది. సర్వనాశనమౌతుంది. ఆమె కోసం విలపించండి! ఆమె వేదన తీరడానికి ఔషధం ఇవ్వండి. ఆమెకు ఒకవేళ స్వస్థత కలుగుతుందేమో,

9మేము బబులోనును బాగు చేద్దామనుకున్నాం. కానీ ఆమె బాగవ్వలేదు. అందరం ఆమెను విడిచిపెట్టి వెళ్లి పోదాం. మన స్వదేశాలకు వెళ్ళి పోదాం. ఆమె దోషం తీవ్రత ఆకాశాన్నంటింది. అది మేఘాల్లో పోగవుతుంది.

10యెహోవాా మన నిర్దోషిత్వాన్ని ప్రకటించాడు. రండి మనం సీయోనులో దీన్ని చెపుదాం. మన దేవుడైన యెహోవాా చేసిన పనులను వివరిద్దాం.

11బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి. బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు. అది యెహోవాా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన.

12బబులోను ప్రాకారాలపై జెండా ఎగరవేయండి. గస్తీ వాళ్ళను నియమించండి. యెహోవా తానూ చేయదలిచింది చేయబోతూ ఉన్నాడు. అందుకని కావలి వాళ్ళను పెట్టండి. పట్టణం నుండి తప్పించుకుని పారిపోయే వాళ్ళను పట్టుకోడానికి సైనికుల్ని దాచి ఉంచండి.

13అనేక ప్రవాహ జలాల దగ్గర నివసించే ప్రజలారా! మీకున్న సంపదలతో మీరు సంపన్నులయ్యారు. మీ ముగింపు వచ్చేసింది. నీ జీవితకాలాన్ని ఆయన కుదించి వేశాడు.>>

14సేనల ప్రభువైన యెహోవా తన ప్రాణం మీదనే ప్రమాణం చేసి <<మిడతల దండు దాడి చేసినట్టుగా నిన్ను నీ శత్రువులతో నింపివేస్తాను. వాళ్ళు నీకు వ్యతిరేకంగా యుద్ధనినాదం చేస్తారు.

15తన శక్తితో ఈ భూమిని చేసిన వాడు తన జ్ఞానంతో పొడి నేలను ఏర్పాటు చేశాడు. తన వివేచనతో ఆకాశాలను విశాలపరిచాడు.

16ఆయన ఉరిమినట్టుగా ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు ఆకాశంలో జలఘోష మొదలవుతుంది. ఆయన భూమి అగాధాల్లోనుంది ఆవిరిని పైకి వచ్చేట్టు చేస్తాడు. ఆయన వర్షం కురిసేలా మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల్లోనుండి గాలిని రప్పిస్తాడు.

17జ్ఞానం లేని ప్రతీ ఒక్కడూ జంతువులా మారతాడు. లోహంతో పోత పోసి విగ్రహాలు చేసేవాడికి ఆ విగ్రహాల మూలంగానే అవమానం కలుగుతుంది. ఎందుకంటే వాడు పోత పోసి చేసేది మోసపు విగ్రహాలే. వాటిలో ప్రాణం ఉండదు.

18అవి పనికిమాలినవి. వాటిని చేసే వాళ్ళు అపహాసకులు. వాటి పైకి శిక్ష వచ్చినప్పుడు అవి నశించి పోతాయి.

19యాకోబుకు చెందిన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అన్నిటినీ రూపొందించేవాడు. ఇశ్రాయేలును ఆయన తన వారసత్వంగా ఎన్నుకున్నాడు. సేనల ప్రభువైన యెహోవాా అని ఆయనకు పేరు.

20నువ్వు నాకు యుద్ధంలో ప్రయోగించే గద లాంటి వాడివి. యుద్ధంలో నువ్వు నా ఆయుధం. నీ ద్వారా నేను జనాలనూ జాతులనూ ధ్వంసం చేస్తాను. రాజ్యాలను నాశనం చేస్తాను.

21నీ ద్వారా నేను గుర్రాలనూ వాటిపై స్వారీ చేసే రౌతులనూ చితకగొడతాను. నీ ద్వారా నేను రథాలను, వాటిని నడిపే సారధులనూ ధ్వంసం చేస్తాను.

22నీ ద్వారా నేను ప్రతీ పురుషుణ్ణీ, స్త్రీనీ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా యువకులనూ, ధ్వంసం వృద్ధులనూ మట్టుబెడతాను. నీ ద్వారా నేను యవ్వనంలో ఉన్న వాళ్ళనీ, కన్యలనూ ధ్వంసం చేస్తాను.

23నీ ద్వారా నేను గొర్రెల కాపరులనూ, వాళ్ళ మందలనూ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా నేను నాగలి దున్నే వాళ్ళనీ వాళ్ళ బృందాలనూ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా నేను పాలించే వాళ్ళనూ అధికారులనూ ధ్వంసం చేస్తాను.

24బబులోనూ, కల్దీయ దేశనివాసులూ సీయోనుకి చేసిన దుర్మార్గానికంతటికీ మీరు చూస్తుండగానే వాళ్లకి ప్రతీకారం చేస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

25<<చూడు, ఇతరుల్ని నాశనం చేసే పర్వతమా, నేను నీకు విరోధంగా ఉన్నాను>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<భూమినంతా నాశనం చేసేదానా, నేను నిన్ను నా చేతితో కొడతాను. నిన్ను శిఖరాల పైనుండి కిందకు దొర్లించి వేస్తాను. పూర్తిగా తగలబడి పోయిన కొండలా నిన్ను చేస్తాను.

26ఇళ్ళు కట్టుకునే వాళ్ళు గోడ మూలాలకు గానీ, పునాదికి గానీ నీ రాళ్ళు వాడుకోరు. నువ్వు ఎప్పటికీ నాశనమయ్యే ఉంటావు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

27దేశంలో జెండాలెత్తండి. జనాల్లో బాకా ఊదండి. ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి. దాని పై దాడి చేయడానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలకు దాన్ని గూర్చి తెలియజేయండి. దానిపై దాడి చేయడం కోసం ఒక సైన్యాధిపతిని నియమించండి. మిడతల దండులా గుర్రాలను తరలించండి.

28ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి. మాదీయుల రాజులను, ఏలికలను పిలవండి. రాజు కింద అధికారులను, అతడి ఆధీనంలో ఉన్న దేశాలన్నిటినీ దాడి చేయడం కోసం నియమించండి.

29బబులోను దేశానికి విరోధంగా యెహోవా ఆలోచనలు కొనసాగుతాయి. కాబట్టి అది వేదన భారంతో ఉంటుంది. భూమి కంపిస్తుంది. అక్కడ నివసించే వాడు ఒక్కడూ లేకుండా బబులోనును వ్యర్ధభూమిగా చేయాలని ఆయన సంకల్పించాడు.

30బబులోనులో సైనికులు పోరాడటం ఆపేశారు. వాళ్ళు తమ కోటలోనే నిలిచారు. వాళ్ళ బలం విఫలమైంది. వాళ్ళు స్త్రీలవలే బలహీనంగా ఉన్నారు.

31బబులోను రాజూ, అతడి పట్టణమూ ఈ చివర నుండి ఆ చివరి వరకూ శత్రువు స్వాధీనంలోకి వెళ్లి పోయాయి. ఈ వార్తను ఒక వార్తాహరుడు మరో వార్తాహరుడికీ, ఒక సైనికుడి నుండి మరో సైనికుడికీ అందించడానికి పరుగు పెడుతున్నారు.

32నదుల పక్కన ఉన్న రేవులను శత్రువులు పట్టుకున్నారు. దాని కోటలను శత్రువులు తగలబెడుతున్నారు. బబులోనులో యుద్ధం చేసే యోధులు అయోమయంలో మునిగిపోయారు.

33సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు. <<బబులోను కుమార్తె ధాన్యం నూర్చే కళ్ళం లాగా ఉంది. ఆమెను కింద తొక్కివేసే సమయం ఇదే. మరికొంత కాలానికి పంట ధాన్యం వస్తుంది.

34యెరూషలేము ఇలా అంటుంది. <బబులోను రాజైన నెబుకద్నెజరు నన్ను మింగి వేశాడు. నేను ఎండిపోయేలా చేశాడు. నన్ను ఖాళీ కుండగా చేశాడు. పెను సర్పంలా నన్ను మింగివేశాడు. నా ఆహారంతో తన కడుపు నింపుకున్నాడు. నన్ను ఖాళీ పాత్రలా చేశాడు.> >>

35సీయోను నివాసులు ఇలా అంటారు. <<నాకూ నా కుటుంబానికీ వ్యతిరేకంగా జరిగిన హింస నా ఉసురు తగిలి బబులోనుకు జరుగుతుంది గాక!>> యెరూషలేము ఇలా అంటుంది. <<నా రక్తం ఒలికించిన పాపం కల్దీయులకు తగుల్తుంది గాక!>>

36కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నాడు. <<చూడండి, నేను నీ పక్షంగా వాదించ బోతున్నాను. నీ తరపున ప్రతీకారం చేస్తాను. బబులోనులో నీళ్ళు లేకుండా చేస్తాను. దాని ఊటలు ఇంకిపోయేలా చేస్తాను.

37బబులోను ఒక పెద్ద చెత్త కుప్పలా ఉంటుంది. నక్కల నిలయంగా మారుతుంది. భయానికీ, ఎగతాళికీ కారణంగా ఉంటుంది. ఎవరూ అక్కడ నివాసం ఉండరు.

38బబులోను వాళ్ళంతా కలసి సింహాల్లా గర్జిస్తారు. సింహం కూనల్లాగా కూత పెడతారు.

39వాళ్ళు దురాశతో ఉద్రేకం చూపినప్పుడు వాళ్ళ కోసం ఒక విందు ఏర్పాటు చేస్తాను. వాళ్ళు బాగా సంతోషపడేలా వాళ్ళతో మద్యం తాగిస్తాను. అప్పుడు వాళ్ళు శాస్వత నిద్రలోకి వెళ్తారు. ఇక మేల్కొనరు. ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

40గొర్రెలు వధకు వెళ్ళినట్టుగా వాళ్ళని వధ్యశాలకు పంపుతాను. గొర్రెపిల్లలూ, మేకలూ వధకు వెళ్ళినట్టుగా వాళ్ళను పంపుతాను.

41బబులోనును ఎలా పట్టుకున్నారు? భూమిపై అందరూ పొగిడే పట్టణం లొంగిపోయింది. రాజ్యాలన్నిటిలో బబులోను ఎలా శిథిల దేశంగా మారింది?

42సముద్రం బబులోను పైకి వచ్చింది. భీకర హోరుతో అలలు దాన్ని ముంచెత్తాయి.

43దాని పట్టణాలు నిర్జనంగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ మారిపోయాయి. ఎవ్వరూ నివాసముండని, ఎవరూ దాని మీదుగా ప్రయాణం చేయని ప్రాంతంలాగా మారిపోయాయి.

44కాబట్టి బబులోనులో ఉన్న బేలు దేవుణ్ణి శిక్షిస్తాను. వాడు మింగినదంతా వాడితో కక్కిస్తాను. ఇకపైన ప్రజలు గుంపులుగా వాడికి అర్పణలు చెల్లించడానికి రారు. బబులోను గోడలు కూలిపోతాయి.

45నా ప్రజలారా! మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి. మీలో ప్రతి ఒక్కడూ నా క్రోధం నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవాలి.

46దేశంలో వినిపించే వార్తలకు మీ హృదయాల్ని భయపడనివ్వకండి. ఈ వార్తలు ఈ సంవత్సరం వినిపిస్తాయి. ఇది అయ్యాక తర్వాత సంవత్సరం మళ్ళీ వార్తలు వినిపిస్తాయి. దేశంలో హింస జరుగుతుంది. ఒక రాజ్యాధిపతికి విరోధంగా మరో రాజ్యాధిపతి ఉంటాడు.

47కాబట్టి చూడండి, బబులోను లోని చెక్కిన విగ్రహాలను నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి. ఆమె దేశం అంతా సిగ్గుకి గురి అవుతుంది. వధకు గురైన ఆమె ప్రజలు దేశంలోనే పడిపోతారు.

48వినాశకులు ఉత్తరం వైపు నుండి ఆమె కోసం వస్తున్నారు>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. అప్పుడు ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నదంతా బబులోనుకు పట్టిన దుర్గతి చూసి సంతోషిస్తుంది.

49ఇశ్రాయేలులో వధకు గురైన వాళ్ళను బబులోను కూల్చినట్టుగానే బబులోనులో వధకు గురైన వాళ్ళు అక్కడే కూలిపోతారు.

50కత్తిని తప్పించుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి పొండి. అక్కడే ఉండకండి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును మీ జ్ఞాపకాల్లోకి రానివ్వండి.

51మమ్మల్ని అవమానపరిచే మాటలు విన్నాం. దానికి సిగ్గు పడుతున్నాం. మాపై పడ్డ నింద మా ముఖాల్ని కప్పి వేసింది. ఎందుకంటే యెహోవా పేరును కలిగి ఉన్న పరిశుద్ధ స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.

52కాబట్టి, వినండి, ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<నేను ఆమె వద్ద ఉన్న చెక్కిన విగ్రహాలను శిక్షించే రోజులు రాబోతున్నాయి. ఆమె దేశమంతా గాయపడిన వాళ్ళు మూలుగుతూ ఉంటారు.

53బబులోను తన ఎత్తైన కోటలను ఎంత బలోపేతం చేసినా, వాళ్ళ కోటలు ఆకాశంలోకి కట్టుకున్నా వినాశకులు నానుండి ఆమె దగ్గరికి వస్తారు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

54<<బబులోనులో నుండి ఏడుపు వినిపిస్తుంది. కల్దీయుల దేశం కూలిపోతున్న మహా నాశన ధ్వని వినిపిస్తుంది.

55యెహోవాా బబులోనును నాశనం చేస్తున్నాడు. దాని మహా ఘోషను అణచివేస్తున్నాడు. వాళ్ళ శత్రువులు అనేక ప్రవాహ జలాల్లా గర్జిస్తున్నారు. వాళ్ళు చేసే శబ్దం బలంగా వినిపిస్తున్నది.

56ఆమెకు వ్యతిరేకంగా, బబులోనుకు వ్యతిరేకంగా వినాశకులు వచ్చేశారు. ఆమె యోధులను పట్టుకున్నారు. వాళ్ళ విళ్ళను విరగ్గొట్టేశారు. యెహోవాా ప్రతీకారం చేసే దేవుడు. ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు.

57బబులోను అధిపతులూ, ఆమె జ్ఞానులూ, ఆమె అధికారులూ, ఆమె సైనికులూ మద్యం తాగి మత్తెక్కేలా చేస్తాను. వాళ్ళు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇక లేవరు.>> ఇది రాజు చేస్తున్న ప్రకటన. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.

58సేనల ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. <<బబులోను భారీ ప్రాకారాలను సంపూర్ణంగా కూల్చి వేస్తారు. దాని ఎత్తైన గుమ్మాలను అగ్నితో కాల్చివేస్తారు. ఆమెకు సహాయం చేయడానికి వచ్చే వాళ్ళ ప్రయాస వృథాయే. ఆమె కోసం జనాలు చేసే ప్రయత్నాలన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి.>>

59ఇది మహసేయా మనవడూ, నేరియా కొడుకూ అయిన సెరాయాకు యిర్మీయా ప్రవక్త ఆజ్ఞాపించిన వాక్కు. ఈ శెరాయా రాజు దగ్గర ప్రధాన అధికారి గనక సిద్కియా పరిపాలన నాలుగో సంత్సరంలో, రాజైన సిద్కియాతో కలిసి సెరాయా యూదా దేశం నుండి బబులోనుకు వెళ్ళినప్పుడు,

60బబులోను పైకి రాబోతున్న విపత్తులన్నిటి గూర్చీ యిర్మీయా ఒక పుస్తకంలో రాశాడు. ఈ మాటలన్నీ బబులోను గూర్చి రాశాడు.

61యిర్మీయా శెరాయాతో ఇలా చెప్పాడు.<<నువ్వు బబులోనుకు వెళ్ళినప్పుడు ఈ మాటలన్నీ తప్పనిసరిగా చదివి వినిపించు.

62<యెహోవా, ఈ స్థలాన్ని నాశనం చేయడానికి నువ్వు ఈ మాటలు ప్రకటించావు. బబులోనులో నివసించేవాడు ఎవడూ లేడు. ప్రజలు గానీ, పశువులుగానీ లేక ఇది శాశ్వతంగా వ్యర్ధభూమిగా ఉండిపోతుంది. ఈ మాటలన్నీ నువ్వే చెప్పావు> అని నువ్వు చెప్పాలి.

63ఈ పుస్తకాన్ని నువ్వు చదివి ముగించిన తర్వాత దానికో రాయి కట్టి యూఫ్రటీసు నదిలో విసిరివెయ్యి.

64<బబులోను ఇలాగే మునిగిపోతుంది. ఆమెకు విరోధంగా నేను పంపబోయే విపత్తుల కారణంగా అది ఇక పైకి లేవదు. దాని ప్రజలు కూలిపోతారు.>అని ప్రకటించు.>> దీంతో యిర్మీయా మాటలు ముగిసాయి.


  Share Facebook  |  Share Twitter

 <<  Jeremiah 51 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran