Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Jeremiah 22 >> 

1యెహోవా ఇలా చెబుతున్నాడు<<నువ్వు యూదా రాజు రాజనగరుకు వెళ్లి అక్కడ ఈ మాట ప్రకటించు.

2<దావీదు సింహాసనం మీద కూర్చున్న యూదా రాజా, నువ్వూ, ఈ ద్వారాలగుండా ప్రవేశించే నీ సిబ్బందీ, నీ ప్రజలూ యెహోవా మాట వినండి.>

3యెహోవా ఇలా చెబుతున్నాడు, <మీరు నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోపిడీకి గురైన వారిని దౌర్జన్యపరుల చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులనూ తండ్రిలేని వారినీ విధవరాళ్ళనూ బాధించవద్దు. వాళ్ళ మీద దౌర్జన్యం చేయవద్దు. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపవద్దు.

4మీరు వీటిని జాగ్రత్తగా పాటిస్తే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులు రథాలూ గుర్రాలూ ఎక్కి ఈ పట్టణ ద్వారాలగుండా ప్రవేశిస్తారు. వారి వెంట వారి సిబ్బందీ వారి ప్రజలూ వస్తారు.

5మీరు ఈ మాటలు వినకపోతే ఈ పట్టణం పాడైపోతుంది.> ఇది యెహోవా వాక్కు. >>

6యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు<<నాకు నువ్వు గిలాదులాగా ఉన్నావు, లెబానోను పర్వత శిఖరంలాగా ఉన్నావు. అయినా నిన్ను ఎడారిగా నివాసులు లేని పట్టణంగా చేస్తాను.

7నీ మీదికి రావడానికి నాశనం చేసేవాళ్ళను ఎన్నుకున్నాను. తమ ఆయుధాలను పట్టుకుని వాళ్ళు వస్తారు. నీ మంచి దేవదారు మ్రానులను నరికేసి మంటల్లో కాల్చివేస్తారు.>>

8అనేక దేశాలవాళ్ళు ఈ పట్టణపు దారిలో నడుస్తారు. <<ఈ గొప్ప పట్టణాన్ని యెహోవా ఎందుకు ఇలా చేశాడు?>> అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు.

9<<ఎందుకంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి ఇతర దేవుళ్ళను పూజించి వాటికి మొక్కారు>> అని జవాబు చెప్పుకుంటారు.

10చనిపోయిన వాళ్ళను గురించి ఏడవవద్దు, వాళ్ళ గురించి అంగలార్చవద్దు. బందీలుగా వెళ్లిపోతున్నవాళ్ళ గురించి మీరు తప్పకుండా ఏడవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక ఎన్నటికీ తిరిగిరారు. తమ జన్మభూమిని ఇక తిరిగి చూడరు.

11తన తండ్రి యోషీయాకు బదులు పరిపాలన చేసి, ఈ స్థలంలోనుంచి వెళ్లిపోయిన యూదా రాజు యోషీయా కొడుకు షల్లూము గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. <<అతడు ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాడు.

12ఈ దేశాన్ని ఇంకెప్పుడూ అతడు చూడడు. వారు అతణ్ణి బందీగా తీసుకుపోయిన స్థలంలోనే అతడు చస్తాడు.>>

13అక్రమంగా తన ఇంటినీ, అన్యాయంగా తన మేడగదులనూ కట్టించుకునే వాడికి బాధ. జీతమివ్వకుండా తన పొరుగువాడి చేత ఊరికే పని చేయించుకునే వాడికి బాధ.

14<<నేను విశాలమైన మేడ గదులున్న పెద్ద ఇంటిని కట్టించుకుంటాను, అనుకునే వాళ్లకు బాధ. అతడు పెద్ద పెద్ద కిటికీలు చేయించుకుని దేవదారు పలకలతో పొదిగి, ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.>>

15నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు.

16అతడు పేదలకూ అక్కరలో ఉన్నవారికీ న్యాయం జరిగిస్తూ సుఖంగా బతికాడు. అలా చేయడమే నన్ను తెలుసుకోవడం కాదా? ఇది యెహోవా వాక్కు.

17అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దౌర్జన్యం చేయడంపై, ఇతరుల్ని అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.

18కాబట్టి యోషీయా కొడుకు యెహోయాకీము అనే యూదా రాజు గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు<<ప్రజలు, అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరీ>> అని అతని గురించి ఏడవరు. <<అయ్యో, యజమానీ! అయ్యో, ఘనుడా>> అని అతని కోసం ఏడవరు.

19అతణ్ణి యెరూషలేము ద్వారాల బయటికి ఈడ్చుకుపోయి అక్కడ పారేసి, గాడిదను పాతిపెట్టినట్టు పాతిపెడతారు.

20లెబానోను పర్వతాలు ఎక్కి కేకలు వెయ్యి. బాషానులో నీ గొంతు పెద్దది చెయ్యి. అబారీము పర్వతాలనుంచి కేకలు వెయ్యి. ఎందుకంటే నీ స్నేహితులంతా నాశనమవుతారు.

21నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను. అయితే <<నేను వినను>> అని నువ్వన్నావు. చిన్నప్పటినుంచి నువ్వు నా మాట వినకుండా ఉండడం నీకు అలవాటే.

22నీ కాపరులంతా గాలికి కొట్టుకుపోతారు. నీ స్నేహితులంతా బందీలుగా వెళ్ళిపోతారు. అప్పుడు నీ దుర్మార్గమంతటి బట్టి నువ్వు కచ్చితంగా అవమానం పొంది సిగ్గుపడతావు.

23రాజువైన నువ్వు, లెబానోను అడవిలోని ఇంటిలో నివసిస్తున్న నువ్వు, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్నా, ప్రసవిస్తూ ఉన్న స్త్రీకి కలిగే వేదనల్లాటివి నీకు కలుగుతాయి. నువ్వెంత మూలుగుతావో!

24యెహోవా చెప్పేదేమిటంటే<<యూదా రాజు యెహోయాకీము కొడుకు యెహోయాకీను నా కుడి చేతికి రాజముద్రగా ఉన్నా అక్కడ నుంచి నిన్ను పెరికివేస్తాను.

25నీ ప్రాణం తీయడానికి చూస్తున్న వారి చేతికి, నువ్వు భయపడుతున్న బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తాను.

26నిన్నూ, నిన్ను కన్న మీ అమ్మనూ మీ జన్మభూమి కాని వేరే దేశంలోకి విసిరివేస్తాను. మీరు అక్కడే చస్తారు.

27వాళ్ళు తిరిగి రావాలని ఎంతో ఆశపడే దేశానికి వాళ్ళు తిరిగి రారు.>>

28ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? యెహోయాకీను పనికిమాలిన కుండా? అతన్నీ అతని సంతానాన్నీ తమకు తెలియని దేశంలోకి వాళ్ళెందుకు తోసేశారు?

29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట విను.

30యెహోవా ఇలా చెబుతున్నాడు<<సంతానం లేనివాడనీ తన రోజుల్లో అతడు వర్ధిల్లడనీ ఈ మనిషి గురించి రాయండి. అతని సంతానంలో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడూ దావీదు సింహాసనం ఎక్కడు. ఇక మీదట ఎవడూ యూదాలో రాజుగా ఉండడు.>>


  Share Facebook  |  Share Twitter

 <<  Jeremiah 22 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran