Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Ezekiel 18 >> 

1యెహోవాా వాక్కు మళ్ళీ నాకు వినిపించి,

2<<తండ్రులు ద్రాక్షలు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి>> అనే సామెత మీరు ఇశ్రాయేలు ప్రదేశం విషయంలో వాడినప్పుడు, దాని అర్ధం ఏంటి?

3నా జీవం తోడు, ఈ సామెత ఇశ్రాయేలీయుల్లో ఇంక మీరు పలకరు. ఇదే ప్రభువైన యెహోవాా వాక్కు.

4<<చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!

5ఒకడు నీతిమంతుడుగా ఉండి, నీతిన్యాయాలు జరిగించేవాడై ఉండి,

6-7 పర్వతాలమీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

8వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి,

9నమ్మకంగా నా ఆదేశాలు పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే, వాడే నీతిమంతుడు. అతడు నిజంగా బ్రతుకుతాడు>> ఇదే ప్రభువైన యెహోవాా వాక్కు.

10కాని ఆ నీతిమంతునికి, ఇలాటివేవీ చెయ్యకుండా రక్తం ఒలికించే ఒక హింసాత్మకుడైన కొడుకు ఉంటే, వాడు బలాత్కారం చేస్తూ, ప్రాణహాని చేస్తూ, చెయ్యరాని పనులు చేసి,

11చెయ్యాల్సిన మంచి పనులు ఏవీ చెయ్యకుండా ఉంటే, అంటే, పర్వతాల మీద భోజనం చెయ్యడం, తన పొరుగువాడి భార్యను చెరచడం,

12అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,

13అప్పిచ్చి వడ్డీ తీసుకోవడం, అధిక లాభం తీసుకోవడం, మొదలైన పనులు చేస్తే, వాడు బ్రతకాలా? వాడు బ్రతకడు! ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు గనుక అతడు తప్పకుండా చస్తాడు. అతని ప్రాణానికి అతడే బాధ్యుడు.

14అయితే అతనికి ఒక కొడుకు పుట్టినప్పుడు, ఆ కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసి, తనమట్టుకు తాను దేవునికి భయపడి, అలాంటి పనులు చెయ్యకపోతే, అంటే,

15పర్వతాలమీద భోజనం చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరచకుండా,

16ఎవరినీ బాధ పెట్టకుండా, తాకట్టు వస్తువు ఉంచుకోకుండా, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యకుండా, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

17పేదవాడి మీద అన్యాయంగా చెయ్యి వేయకుండా, లాభం కోసం అప్పివ్వకుండా, వడ్డీ తీసుకోకుండా, నా ఆదేశాలు పాటిస్తూ నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!

18అతని తండ్రి క్రూరంగా ఇతరులను బాధపెట్టి, బలవంతంగా తన సహోదరులను దోపిడీ చేసి, తన ప్రజల్లో తగని పనులు చేశాడు గనుక తన పాపం కారణంగా తానే చస్తాడు.

19కాని మీరు, <<తండ్రి పాపశిక్ష కొడుకు ఎందుకు మొయ్యడు?>> అంటారు. ఎందుకంటే, కొడుకు నీతిన్యాయాలకు అనుగుణంగా, నా శాసనాలనే అనుసరించి వాటి ప్రకారం చేస్తున్నాడు గనుక అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!

20పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.

21అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచి, నా శాసనాలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయం జరిగిస్తే అతడు చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు.

22అతనికి విరోధంగా అతడు చేసిన అతిక్రమాలు జ్ఞాపకానికి రావు. అతడు పాటించే నీతినిబట్టి అతడు బ్రదుకుతాడు.

23<<దుష్టులు నశిస్తే నేను గొప్పగా ఆనందిస్తానా? అతడు తన ప్రవర్తన సరిచేసుకుని బ్రతకడమే నాకు ఆనందం.>> ఇదే ప్రభువైన యెహోవాా వాక్కు.

24<<కాని, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి, దుష్టులు చేసే అసహ్యమైన పనులు జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అతడు నాకు నమ్మకద్రోహం చేసి రాజద్రోహం జరిగించాడు గనుక అతడు చేసిన నీతి పనులు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. కాబట్టి అతడు చేసిన పాపం కారణంగా చస్తాడు.

25కాని మీరు, <యెహోవాా మార్గం న్యాయం కాదు> అంటారు. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి! మీ మార్గాలే గదా అన్యాయమైనవి.

26నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే అతడు వాటిని బట్టి చస్తాడు. తాను పాపం చేసిన కారణంగానే అతడు చస్తాడు.

27కాని ఒక దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం నుంచి వెనుదిరిగి నీతిన్యాయాలు జరిగిస్తే తన ప్రాణం రక్షించుకుంటాడు.

28అతడు గమనించుకుని తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నీ చెయ్యకుండా మాని వేశాడు గనక అతడు చావకుండా కచ్చితంగా బ్రతుకుతాడు.

29కాని ఇశ్రాయేలీయులు<యెహోవాా మార్గం న్యాయం కాదు> అని అంటున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గం న్యాయం ఎందుకు కాదు? మీ మార్గం అన్యాయం ఎందుకు కాదు?

30కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి.

31మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి?

32నశించేవాడి చావు కారణంగా నేను ఆనందించేవాణ్ణి కాదు>> ఇదే ప్రభువైన యెహోవాా వాక్కు. <<కాబట్టి మీరు మనస్సు మార్చుకుని బ్రతకండి.>>


  Share Facebook  |  Share Twitter

 <<  Ezekiel 18 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran