Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Ezekiel 13 >> 

1యెహోవాా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.

2<<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవచనం చెప్తున్న ప్రవక్తలకు విరోధంగా ప్రవచించు. తమ సొంత ఆలోచనలను ప్రవచనాలుగా చెప్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. యెహోవాా మాట వినండి!

3ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. దర్శనం ఏదీ చూడకుండా సొంత ఆలోచనలను అనుసరించే తెలివి తక్కువ ప్రవక్తలకు బాధ!

4ఇశ్రాయేలు ప్రజలారా, మీ ప్రవక్తలు బంజరు భూముల్లో తిరిగే నక్కల్లా ఉన్నారు.

5యెహోవాా దినాన జరిగే యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు శత్రువును ఎదిరించడానికి మీరు గోడలలో ఉన్న పగుళ్ళ జోలికి వెళ్ళరు. ప్రాకారానికి మరమ్మత్తులు చేయరు.

6<యెహోవాా ఇలా చెప్తున్నాడు> అని చెప్పే వాళ్ళు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధపు జోస్యాలు చెప్తారు. యెహోవాా వాళ్ళని పంపలేదు. అయినా తమ సందేశం జరుగుతుంది అని ప్రజలు ఆశ పడేలా చేస్తారు.

7నేను అసలేమీ మాట్లాడకుండానే <యెహోవాా చెప్పేది ఇదీ, అదీ> అంటూ చెప్పే మీరు అబద్ధపు దర్శనాలు చూడలేదా? అబద్ధపు జోస్యాలు చెప్పలేదా?

8కాబట్టి ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. మీరు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ప్రభువైన యెహోవాా మీకు విరోధంగా చేస్తున్న ప్రకటన ఇదే,

9అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాాను, అని మీరు తెలుసుకుంటారు.

10శాంతి లేకుండానే <శాంతి> అని ప్రవచిస్తూ నా ప్రజలను వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఒక గోడ కట్టి దానిపై సున్నం పూస్తున్నారు

11గోడకి సున్నం వేస్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. ఇది కూలిపోతుంది. జడివాన కురుస్తుంది. దీన్ని పడగొట్టడానికి నేను పిడుగులు పంపిస్తాను. పడిన గోడను చిన్నాభిన్నం చేయడానికి గాలి తుఫానుని పంపుతాను.

12ఆ గోడ పడిపోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని <మీరు వేసిన సున్నం ఎక్కడ?> అని అడుగుతారా లేదా?>>

13కాబట్టి ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. <<నా క్రోధంలో నుండి గాలి తుఫాను, నా గొప్ప కోపంలో నుండి కుంభవృష్టిగా వర్షాలూ రప్పిస్తాను! నా క్రోధం వల్ల పడిన వడగళ్ళు ఆ గోడను సమూలంగా ధ్వంసం చేస్తాయి.

14మీరు సున్నం వేసిన గోడను పునాదులు కనపడేలా నేలమట్టం చేస్తాను. అది పడిపోతుంది. దాని కింద మీరూ నిర్మూలం అవుతారు. అప్పుడు నేనే యెహోవాాను అని మీరు తెలుసుకుంటారు.

15ఈ విధంగా నేను మహా కోపంతో ఆ గోడనూ, దానికి సున్నం వేసిన వాళ్ళనీ నిర్మూలం చేస్తాను. అప్పుడు మీతో నేను <గోడ ఇక లేదు. అలాగే దానికి సున్నం వేసిన వాళ్ళు కూడా లేరు> అని చెప్తాను.

16సున్నం వేసిన వాళ్ళు ఎవరంటే యెరూషలేముకి శాంతి లేకున్నా యెరూషలేముకి శాంతి కలుగుతుందని దర్శనాలు చూసిన ఇశ్రాయేలు ప్రజల ప్రవక్తలే. ఇదే ప్రభువైన యెహోవాా పలికిన మాట.>>

17నరపుత్రుడా, తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవచనం పలికే ఇశ్రాయేలు ప్రజల కూతుళ్ళకు విరోధంగా ప్రవచించు.

18ఇలా చెప్పు. ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. ప్రజలను ఉచ్చులోకి లాగేందుకు తమ చేతుల నిండా తాయెత్తులు కట్టుకుని తమ తలలపై రకరకాల ముసుగులు వేసుకునే స్త్రీలకు బాధ. నా ప్రజల ప్రాణాలను ఉచ్చులోకి లాగుతూ మీ ప్రాణాలను కాపాడుకోగలరా?

19చారెడు బార్లీ గింజలకీ కొన్ని రొట్టె ముక్కలకీ ఆశపడి ప్రజల్లో నా పేరును అవమానపరిచారు. అబద్దాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్తూ వాళ్ళు నిర్దోషులను చంపేలా, చావడానికి అర్హులైన వాళ్ళను విడిచిపెట్టేలా చేశారు.

20కాబట్టి ప్రభువైన యెహోవాా ఇలా చెప్తున్నాడు. పక్షులకు వల విసిరినట్టుగా ప్రజల ప్రాణాలకు ఉచ్చు వేయడానికి మీరు ఉపయోగించే తాయెత్తులకి నేను వ్యతిరేకం. వాటిని మీ చేతులనుండి నేను కచ్చితంగా తెంపి వేస్తాను. పక్షులను పట్టినట్టు మీరు వల వేసి పట్టిన ప్రజలను నేను విడిపిస్తాను.

21వాళ్ళు ఇకపై మీ చేతుల్లో బందీలుగా ఉండకుండాా నేను మీ ముసుగులను చింపి వాళ్ళని విడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాాను అని మీరు తెలుసుకుంటారు.

22నీతిగల వ్యక్తి నిరుత్సాహపడాలని నేను కోరుకోను. కానీ మీరు మీ అబద్దాల చేత నీతిగల వ్యక్తులను నిరుత్సాహపరిచారు. దుర్మార్గుడు తన పాపం వదిలేసి తన ప్రాణాన్ని కాపాడుకోకుండా మీరు వాడి దుర్మార్గతను ప్రోత్సహించారు.

23కాబట్టి మీరు ఇకనుండి అబద్ధపు దర్శనాలు చూడరు. జోస్యాలూ చెప్పరు. నా ప్రజలను నేను మీ స్వాధీనం నుండి విడిపిస్తాను. అప్పుడు నేను యెహోవాాను అని మీరు తెలుసుకుంటారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Ezekiel 13 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran