Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Romans 13 >> 

1ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.

2కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు.

3పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు.

4వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు.

5కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడాా అధికారులకు లోబడాలి.

6ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.

7ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.

8ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు.

9ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.

10ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.

11కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది.

12రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం.

13పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం.

14చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.


  Share Facebook  |  Share Twitter

 <<  Romans 13 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran