Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Ecclesiastes 12 >> 

1కష్టకాలం రాకముందే, <<జీవితం అంటే నాకిష్టం లేదు>> అని నువ్వు చెప్పే కాలం రాకముందే,

2సూర్య చంద్ర నక్షత్రాల కాంతికి చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మబ్బులు మళ్ళీ రాక ముందే, నీ యువ ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరించుకో.

3ఆ సమయంలో ఇంటి కావలివారు వణకుతారు. బలంగా ఉండేవారు వంగిపోతారు. తిరగలి విసిరే స్త్రీలు కొద్దిమందే ఉంటారు కాబట్టి పని ఆపేస్తారు. కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఇక చూడలేరు.

4తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. వీధి తలుపులు మూసేస్తారు. పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి.

5ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, సహజమైన కోరికలు అంతరిస్తాయి. అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు.

6వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే, లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే, లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో.

7మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళిపోతుంది.

8ప్రసంగి ఇలా అంటున్నాడు<<నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.>>

9ఈ ప్రసంగి తెలివైనవాడు. అతడు ప్రజలకు జ్ఞానం బోధించాడు. అతడు బాగా చదివి, సంగతులు పరిశీలించి అనేక సామెతలు రాశాడు.

10ప్రసంగి చక్కటి మాటలు యథార్థంగా రాయడానికి ప్రయత్నించాడు.

11తెలివి గల వారి మాటలు ములుకోలల్లాంటివి. ఈ సామెతలు, అనుభవజ్ఞులు సమకూర్చిన మాటల్లాగా, గట్టిగా బిగించి, దిగగొట్టిన మేకుల్లాగా ఒక కాపరి బోధించినట్టుగా ఉన్నాయి.

12కుమారా, ఇంకా ఇతర విషయాల గూర్చి జాగ్రత్తపడు. అంతూ పొంతూ లేని గ్రంథాల రచన. విపరీతంగా చదవడం వలన శరీరం అలిసిపోతుంది.

13ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. మానవులంతా చేయాల్సింది ఇదే.

14ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Ecclesiastes 12 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran