Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Matthew 28 >> 

1విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.

2ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.

3ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.

4అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.

5ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు.

6ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి,

7త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.

8వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా

9యేసు వారికి ఎదురు వచ్చి, “మీకు శుభం!” అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాలపై వాలి ఆయనను పూజించారు.

10అప్పుడు యేసు, “భయపడకండి. మీరు వెళ్ళి, నా సోదరులను గలిలయకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారితో చెప్పాడు.

11వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు.

12కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి,

13“మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి.

14ఇది గవర్నరుకు తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం.” అన్నారు.

15సైనికులు ఆ డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది.

16పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు.

17అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.

18అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.

19కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ

20నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 28 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran