Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Colossians 3 >> 

1అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు.

2పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు.

3ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవం దేవునితో క్రీస్తులో దాచి పెట్టబడి ఉంది.

4మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు.

5కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్ర, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి.

6వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.

7గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు.

8కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి.

9ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు.

10ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

11ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.

12కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి.

13ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

14వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.

15క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

16క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

17మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి యేసు ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

18భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన.

19భర్తలారా, మీ భార్యల్ని ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు.

20పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.

21తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహపడకుండేలా వారిని రెచ్చగొట్టవద్దు.

22దాసులారా, మనుషుల్ని మెప్పించాలని చూసే వారిలా పైకి కనిపించాలని కాకుండా ప్రభువుకు భయపడుతూ చిత్తశుద్ధితో అన్ని విషయాల్లో మీ యజమానులకు లోబడి ఉండండి.

23మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి.

24ప్రభువు నుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.

25అక్రమం చేసేవాడికి తాను చేసిన అక్రమానికి తగిన శాస్తి జరుగుతుంది. ఎలాంటి పక్షపాతం ఉండదు.


  Share Facebook  |  Share Twitter

 <<  Colossians 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran