Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Genesis 8 >> 

1దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.

2అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది.

3అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.

4ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది.

5పదో నెల వరకు నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి.

6నలభై రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి

7ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకు ఇటూ అటూ తిరుగుతూ ఉంది.

8నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతను తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు.

9భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరకు తిరిగి వచ్చింది. అతను చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు.

10అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు.

11సాయంకాలానికి అది అతని దగ్గరకు తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్నిబట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు.

12అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరకు తిరిగి రాలేదు.

13ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది.

14రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది.

15అప్పుడు దేవుడు నోవహుతో,

16<<నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి.

17పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకొని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి>> అని చెప్పాడు.

18కాబట్టి నోవహు, అతనితోపాటు అతని కొడుకులు అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు.

19ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమిమీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలోనుంచి బయటకు వచ్చాయి.

20అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు.

21యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి, <<వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.

22భూమి ఉన్నంత వరకు విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు>> అని తన హృదయంలో అనుకొన్నాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Genesis 8 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran