Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Judges 16 >> 

1తర్వాత సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెతో ఉండిపోయాడు.

2సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తర్వాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు.

3సంసోను అర్థ రాత్రి వరకూ పండుకున్నాడు. అర్థ రాత్రి వేళ ఆ పట్టణం ద్వారం తలుపులను వాటి రెండు దర్వాజాలనూ అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండశిఖరానికి వాటిని తీసుకు వెళ్ళాడు.

4ఆ తర్వాత సంసోను శోరేకు లోయలో నివాసముండే ఒక స్త్రీని ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా.

5ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో, <<నువ్వు అతణ్ణి ఏమార్చి అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేం అతణ్ణి బంధించడానికి ఎలా అతణ్ణి గెలవవచ్చో తెలుసుకో. మేం అతణ్ణి బంధించి అతని గర్వం అణచివేస్తాం. నువ్వు దీనిని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి నాణేలిస్తాం>> అన్నారు.

6కాబట్టి దెలీలా, <<నువ్వు ఇంత బలంగా ఉండటానికి కారణమేంటో, నిన్ను ఓడించాలంటే దేంతో నిన్ను బంధించాలో దయచేసి నాకు చెప్పు>> అని సంసోనును అడిగింది.

7దానికి సంసోను <<ఏడు పచ్చి వింటినారలతో నన్ను కట్టిపడేస్తే నాలో బలం పోయి అందరిలానే ఉంటాను>> అన్నాడు.

8ఫిలిష్తీయుల అధికారులు ఏడు పచ్చి వింటినారలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వాటితో అతణ్ణి బంధించింది.

9ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె, <<సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!>> అంది. అతడు తనను బంధించిన వింటినారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు.

10అప్పుడు దెలీలా <<చూడు, నువ్వు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. దయచేసి నిన్ను ఎలా లొంగదీసుకోవచ్చో నాకు చెప్పు>> అని సంసోనుతో అంది.

11సంసోను, <<కొత్తగా పేనిన, ఇంత వరకూ వాడని తాళ్ళతో నన్ను బంధించాలి. అప్పుడు నేను అందరిలాగా బలహీనుడి నౌతాను>> అన్నాడు.

12అప్పుడు దెలీలా కొత్తగా పేనిన తాళ్లతో అతణ్ణి బంధించింది. <<సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!>> అని సంసోనుతో అంది. అప్పటికే ఆమె గదిలో కొందరు వేచి చూస్తున్నారు. సంసోను లేచి ఆ తాళ్ళను నూలు పోగుల్లా తెంపేశాడు.

13అప్పుడు దెలీలా, <<ఇప్పటివరకూ నువ్వు నన్ను మోసం చేస్తూ అబద్ధమే చెప్పావు. దేనితో నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు>> అంది. అప్పుడు సంసోను, <<నా తలపై ఉన్న ఏడు జడల్ని మగ్గంలో నేతలాగ అల్లితే సరి>> అన్నాడు.

14అప్పుడు అతడు నిద్రిస్తున్నప్పుడు ఆమె అతని తలపై ఏడు జడలు మగ్గంపై అల్లి మేకుతో మగ్గానికి దిగగొట్టింది. తర్వాత << సంసోనూ, ఫిలిష్తీయులు వచ్చేశారు! >> అంటూ అతణ్ణి నిద్ర లేపింది. సంసోను నిద్ర నుండి లేచి మగ్గపు మేకునూ నేతనూ ఊడబెరికాడు.

15అప్పుడు ఆమె <<నీ రహస్యాలేవీ నాకు చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనగలుగుతున్నావు? ఇప్పటికి మూడు సార్లు నన్ను మోసం చేశావు. నీ మహాబలం దేనిలో ఉందో ఇంతవరకు నాకు చెప్పలేదు>> అంది.

16ఇక ఆమె ప్రతిరోజూ తన మాటలతో అతణ్ణి విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి <చావే నయం> అనిపించింది.

17అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. <<నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను>> అని ఆమెకు చెప్పాడు.

18అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. <<మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు>> అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరకు వచ్చారు.

19ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది.

20ఆమె, <<సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!>> అంది. సంసోను నిద్ర లేచి <ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను> అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు.

21అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి బంధించి అతని కన్నులు ఊడబెరికారు. గాజాకు అతణ్ణి తీసుకు వచ్చి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు.

22అతణ్ణి చెరసాలలో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి.

23ఫిలిష్తీయుల అధికారులు <<మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు>> అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు.

24అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి, <<మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకుల్ని చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు>> అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు.

25వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు, << సంసోనును తీసుకు రండి. అతణ్ణి చూసి ఎగతాళి చేసి నవ్వుదాం>> అన్నారు. వాళ్ళు అతణ్ణి తీసుకు వచ్చి రెండు స్తంభాల మధ్య అతణ్ణి నిలబెట్టారు.

26సంసోను తన చెయ్యి పట్టుకొని ఉన్న కుర్రాడితో, <<ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను.>> అన్నాడు.

27ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు.

28అప్పుడు సంసోను, <<ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచేయి. నా కన్నులు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి>> అని యెహోవాకు మొర్ర పెట్టాడు.

29ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాలలో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు.

30<<నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం>> అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారులమీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ.

31అప్పుడు అతని సహోదరులూ, అతని తండ్రి ఇంటివారూ వచ్చి అతణ్ణి తీసుకు వెళ్ళారు. అతణ్ణి జోర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న అతని తండ్రియైన మానోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Judges 16 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran