Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Judges 10 >> 

1అబీమెలెకు తరువాత ఇశ్శాఖారు గోత్రంవాడు, దోదో మనువడు, పువ్వా కొడుకు అయిన తోలా న్యాయాధిపతిగా నియామకం అయ్యాడు. అతడు ఎఫ్రాయిమీయుల మన్యంలో షామీరులో నివాసం ఉండేవాడు.

2అతడు ఇరవైమూడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయినప్పుడు అతణ్ణి షామీరులో పాతిపెట్టారు.

3అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు వచ్చాడు. అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.

4అతనికి ముప్ఫైమంది కొడుకులున్నారు. వాళ్ళు ముప్ఫై గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవాళ్ళు. వాళ్ళకు ముప్ఫై ఊళ్లు ఉండేవి. ఈ రోజు వరకు వాటికి యాయీరు గ్రామాలని పేరు.

5అవి గిలాదు దేశంలో ఉన్నాయి. యాయీరు చనిపోయినప్పుడు అతణ్ణి కామోనులో పాతిపెట్టారు.

6ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడుగా ప్రవర్తించి యెహోవాను విడిచిపెట్టి ఆయన సేవ మాని, బయలులు, అష్తారోతులు అనే ఆరామీయుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను, పూజించడం మొదలుపెట్టారు.

7యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు, ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వాళ్ళను అప్పగించాడు గనుక,

8వాళ్ళు ఆ సంవత్సరం మొదలు, ఇశ్రాయేలీయులను, అంటే, యొర్దాను అవతల ఉన్న, గిలాదులోని అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను పద్దెనిమిది సంవత్సరాలు చితకగొట్టి అణచివేశారు.

9ఇంక అమ్మోనీయులు యూదాదేశస్థులతో బెన్యామీనీయులతో ఎఫ్రాయిమీయులతో యుద్ధం చెయ్యడానికి యొర్దాను దాటినందువల్ల ఇశ్రాయేలీయులకు గడ్డు పరిస్థితులు దాపురించాయి.

10అప్పుడు ఇశ్రాయేలీయులు, <<మేం నీ దృష్టిలో పాపం చేశాం. మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించాం>> అని యెహోవాకు మొర్రపెట్టారు.

11యెహోవా, <<ఐగుప్తీయుల వశంలో నుంచి, అమోరీయుల వశంలో నుంచి, అమ్మోనీయుల వశంలో నుంచి, ఫిలిష్తీయుల వశంలో నుంచి మాత్రమే కాకుండా

12సీదోనీయులు, అమాలేకీయులు, మాయోనీయులు మిమ్మల్ని బాధ పరచినప్పుడు వాళ్ళ వశంలో నుంచి కూడా నేను మిమ్మల్ని రక్షించాను కదా,

13అయితే మీరు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవతలను పూజించారు గనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను.

14మీరు వెళ్లి, మీరు కోరుకొన్న దేవతలకు మొర్ర పెట్టుకోండి; మీ శ్రమకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో>> అని ఇశ్రాయేలీయులతో అన్నాడు.

15అప్పుడు ఇశ్రాయేలీయులు, <<మేము పాపం చేశాము, నీ దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాకు చెయ్యి. దయచేసి ఈ రోజు మమ్మల్ని రక్షించు>> అని చెప్పి,

16యెహోవాను సేవించడానికి వాళ్ళ మధ్య ఉన్న ఇతర దేవతలను తొలగించివేసారు. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహించలేక పోయింది.

17అప్పుడు అమ్మోనీయులు గిలాదులో శిబిరం వేసుకుని ఉన్నారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకొని ఉన్నారు.

18కాబట్టి ప్రజలు, అంటే గిలాదు పెద్దలు, <<అమ్మోనీయులతో యుద్ధం చెయ్యడానికి పూనుకొన్నవాడు ఎవడో, అతడు గిలాదు నివాసులకందరికీ ప్రధాని అవుతాడు>> అని ఒకడితో ఒకడు చెప్పుకొన్నారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Judges 10 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran