Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Philippians 3 >> 

1చివరిగా, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి. ఈ విషయాలనే మీకు మరలా రాయడం నాకేమీ సమస్య కాదు. మీకది క్షేమకరం.

2కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త.

3ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం.

4చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను.

5ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీ తల్లిదండ్రులకు పుట్టిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి.

6క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి కంకణం కట్టుకున్న వాణ్ణి. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణ విధేయతతో పాటించాను.

7అయినా ఏవేవి నాకు లాభంగా ఉండేవో వాటన్నిటినీ క్రీస్తు కోసం పనికిరానివిగా ఎంచాను.

8వాస్తవంగా నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. కాబట్టి మిగతా సమస్తాన్నీ పనికిరానిదిగా ఎంచుతున్నాను. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును మాత్రమే సంపాదించటానికి, వాటిని చెత్తతో సమానంగా ఎంచాను.

9ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతి, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.

10-11 ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం గలవాడినై, ఆయన్నూ ఆయన పునరుత్థాన బలాన్నీతెలుసుకునేందుకు, ఆయన హింసల్లో భాగస్వామినయేందుకు, సమస్తాన్నీ నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా చూస్తున్నాను.

12వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

13సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను.

14క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.

15కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.

16ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము.

17సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి.

18చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను.

19నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.

20మనం పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం.

21సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Philippians 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran