Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Ephesians 2 >> 

1మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు

2పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు.

3పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

4అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక,

5మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనల్ని క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

6దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు.

7రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

8మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు.

9అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు.

10మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనల్ని క్రీస్తు యేసులో సృష్టించాడు.

11కాబట్టి పూర్వం మీరు శారీరికంగా అన్యులు. “శరీరంలో మనుషుల చేతితో సున్నతి పొందిన యూదులు” మిమ్మల్ని “సున్నతి లేనివారు” అని పిలిచేవారు.

12ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.

13అయితే పూర్వం దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గరయ్యారు.

14ఆయనే మన శాంతి. ఆయన యూదులనూ యూదేతరులనూ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న విరోధమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు.

15అంటే, ఆ ఇద్దరి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు.

16వారి మధ్య ఉన్న వైరాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు

17యేసు వచ్చి దూరంగా ఉన్నవారికి సువార్తను, శాంతిని ప్రకటించాడు. దగ్గరగా ఉన్నవారికి శాంతిసమాధానాలు ప్రకటించాడు.

18యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం.

19కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు. పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు.

20క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు.

21ఆయన వల్లనే తన కుటుంబమనే కట్టడం చక్కగా అమరి, ప్రభువు కోసం పరిశుద్ధ దేవాలయంగా రూపొందుతూ ఉంది.

22ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాసస్థలంగా ఉండడానికి వృద్ది చెందుతూ ఉన్నారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Ephesians 2 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran