Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Ephesians 1 >> 

1ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.

2మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి సమాధానాలు కలుగు గాక.

3మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనల్ని దీవించాడు.

4క్రీస్తులో మనల్ని సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు.

5యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.

6తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.

7దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.

8ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.

9ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.

10కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.

11క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని,

12దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకొని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.

13మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది.

14దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

15ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుండి

16మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.

17మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

18మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.

19తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.

20దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.

21సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు.

22దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు.

23ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.


  Share Facebook  |  Share Twitter

 <<  Ephesians 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran