Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Chronicles 31 >> 

1ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఎత్తైన పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాలలో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.

2హిజ్కియా యాజకులకూ, లేవీయులకూ వారి వారి సేవాధర్మం ప్రకారం, వారి వారి వరసలు నియమించాడు. దహనబలులూ సమాధాన బలులూ, శాంతి బలులూ అర్పించడానికీ, ఇతర సేవలూ చేయడానికీ యెహోవా మందిర గుమ్మాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికీ, స్తుతులు చెల్లించడానికీవారిని నియమించాడు.

3యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహనబలుల కోసం విశ్రాంతిదినాలకూ, అమావాస్యలకూ నియామక కాలాలకూ అర్పించవలసిన దహనబలుల కోసం తన సొంత ఆస్తిలోనుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు.

4యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.

5ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసికొని వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.

6యూదా పట్టణాలలో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెలలో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువులలో పదవ వంతు తీసికొని వచ్చి కుప్పలుగా పోశారు.

7వారు మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి ఏడవ నెలలో ముగించారు.

8హిజ్కియా, అతని అధికారులూ వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.

9హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీయులను ప్రశ్నించాడు. సాదోకు సంతతివాడు ప్రధానయాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు.

10<<యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి పోతున్నది. యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదించినందుకు ఇంత గొప్పరాశి మిగిలింది.>>

11హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచాలని ఆజ్ఞ ఇచ్చాడు.

12తరువాత వారు కానుకల్నీ పదవ భాగాల్నీ ప్రతిష్ట చేసిన వస్తువుల్నీ నమ్మకంగా లోపలకు తెచ్చారు. లేవీయుడైన కొనన్యా వాటికి నిర్వహణాధికారి. అతని సోదరుడైన షిమీ అతనికి సహకారి.

13యెహీయేలు, అజజ్యా, నహతు. అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనేవారు కొనన్యా చేతి కింద, అతని సోదరుడు షిమీ చేతి కింద తనిఖీ చేసేవారుగా ఉన్నారు. రాజైన హిజ్కియా దేవుని మందిరానికి అధికారిగా ఉన్న అజర్యా వారిని నియమించారు.

14తూర్పువైపు గుమ్మం దగ్గర పాలకుడూ లేవీయుడైన ఇమ్నా కొడుకు కోరే, దేవునికి సమర్పించిన స్వేచ్చార్పణల మీద అధికారి. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకల్నీ ప్రతిష్టిత వస్తువుల్నీ పంచిపెట్టడం అతని పని.

15అతని చేతి కింద ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనేవారున్నారు. వారు నమ్మకమైనవారు కాబట్టి యాజకుల పట్టణాలలో ప్రముఖులనీ సామాన్యులనీ తేడా లేకుండా తమ సోదరులకు వరస క్రమాల ప్రకారం వారి భాగాలను పంచిపెట్టడానికి వారిని నియమించారు.

16అంతేకాక మూడేళ్ళు మొదలు అంతకు పైవయసుండి వంశవృక్షాలలో నమోదైన మగపిల్లలకు కూడా వంతుల ప్రకారం పంచిపెట్టారు. వారి వారి వరసల ప్రకారం బాధ్యతల ప్రకారం సేవచేయడానికి ప్రతిరోజూ యెహోవా మందిరంలోనికి వచ్చేవారందరికీ పంచిపెట్టారు.

17ఇరవై ఏళ్ళు మొదలు అంతకు పై వయసుండి వంతుల ప్రకారం సేవచేయడానికి తమ తమ పూర్వీకుల వంశాల ప్రకారం యాజకులలో సరిచూడబడిన లేవీయులకు పంచిపెట్టారు.

18అంటే నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీయులకు తమ పిల్లలతో భార్యలతో కొడుకులతో కూతుర్లతో

19సమాజమంతా సరిచూడబడినవారికి, ఆ యా పట్టణాలకు చేరిన గ్రామాలలో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకు, వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు. పేరుల ప్రకారం చెప్పబడిన ఆ ప్రజలు యాజకులలో పురుషులందరికి, లేవీయులలో వంశాల ప్రకారం సరిచూడబడిన వారందరికి వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు.

20హిజ్కియా యూదా దేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యధార్థంగా నమ్మకం గా ప్రవర్తించాడు.

21దేవుని మందిర సేవకోసం, ధర్మశాస్త్రం కోసం, ఆజ్ఞల కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలో అతడు తన దేవుణ్ణి వెదకి అనుసరించాడు. హృదయపూర్వకంగా అనులు జరిగించాడు గనక వర్ధిల్లాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Chronicles 31 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran