Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Corinthians 5 >> 

1భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.

2పరలోక సంబంధమైన మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఈ గుడారంలో మూలుగుతున్నాం.

3ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం.

4ఈ గుడారంలో ఉన్న మనం బరువు మోస్తూ మూలుగుతూ ఉన్నాం. వీటిని తీసివేయాలని కాదు గాని చావుకు లోనయ్యేది జీవం చేత మింగివేయబడాలి అన్నట్టుగా, ఆ నివాసాన్ని దీని మీద ధరించుకోవాలని మన ఆశ.

5దీని కోసం మనల్ని సిద్ధపరచినవాడు దేవుడే. ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు.

6అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.

7కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము.

8ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం.

9అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.

10మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.

11కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులతో ప్రజలను ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము.

12మాకు మేమే మీ ఎదుట మళ్ళీ మెప్పించుకోవడం లేదు, హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయమై మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాము.

13మాకు మతి తప్పింది అని ఎవరైనా అంటే అది దేవుని కోసమే. మేము స్థిర చిత్తులం అంటే అది మీ కోసమే.

14క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం కచ్చితం.

15బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.

16ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే చూశాం. అయితే ఇప్పటి నుండి ఇలా వ్యవహరించం.

17కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి.

18అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు.

19అంటే, దేవుడు వారి అతిక్రమాల్ని వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.

20కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం.

21ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Corinthians 5 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran