Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Hebrews 2 >> 

1అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.

2ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే,

3ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది.

4దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు.

5మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు.

6దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు?

7నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు.

8నువ్వు సమస్తాన్నీ అతనికి లోబరచి అతని పాదాల కింద ఉంచావు.” ఆయన సమస్తాన్నీ అతని వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు.

9అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు.

10ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో ఆయన అనేకమంది కుమారుల్ని మహిమకు తీసుకురావడం కోసం వారి రక్షణ కర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవునికి సమంజసమే.

11పరిశుద్ధులుగా అయ్యేవారికీ, వారిని పరిశుద్ధపరిచే వానికీ దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు తాను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవడానికి సంకోచించడు.

12ఆయన, “నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను” అన్నాడు.

13ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు. ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు.

14కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకొన్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు.

15మరణ భయంతో జీవిత కాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు.

16ఆయన కచ్చితంగా దేవదూతలకు సహాయం చేయడం లేదు. అబ్రాహాము సంతతి వారికే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు.

17దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన, కరుణ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా కావాల్సిన అవసరం వచ్చింది.

18ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.



 <<  Hebrews 2 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran