Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  2 Chronicles 36 >> 

1అప్పుడు దేశ ప్రజలు యోషీయా కొడుకైన యెహోయాహాజును యెరూషలేములో అతని తండ్రి స్థానంలో అతణ్ణి రాజుగా నియమించారు.

2యెహోయాహాజు 23 ఏళ్ళ వాడు. అతడు యెరూషలేములో 3 నెలలు పాలించాడు.

3ఐగుప్తు రాజు యెరూషలేముకు వచ్చి అతని తొలగించి, ఆ దేశానికి 4,000 కిలోల వెండినీ 34 కిలోల బంగారాన్ని జరిమానాగా నిర్ణయించాడు.

4అతని సోదరుడైన ఎల్యాకీమును యూదా మీదా యెరూషలేము మీదా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అనే వేరే పేరు పెట్టాడు. నెకో అతని సోదరుడైన యెహోయాహాజును పట్టుకుని ఐగుప్తుకు తీసుకు పోయాడు.

5యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతడు 25 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

6అతని మీదికి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతణ్ణి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుపోయాడు.

7నెబుకద్నెజరు యెహోవా మందిరంలోని కొన్ని సామానులు తీసుకు పోయి బబులోనులో ఉన్న తన భవనంలో ఉంచాడు.

8యెహోయాకీం గురించిన ఇతర విషయాలూ, అతడు చేసిన అసహ్యమైన పనులూ అతనిలో కనబడ్డ చెడ్డ ప్రవర్తన గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో రాసి ఉంది. అతని కొడుకు యెహోయాకీను అతనికి బదులు రాజయ్యాడు.

9యెహోయాకీను పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతడు ఎనిమిదేళ్ల వాడు. అతడు యెరూషలేములో 3 నెలల 10 రోజులు పాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు.

10ఏడాది నాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి, యెహోవా మందిరంలోని విలువైన వస్తువుల్ని కూడా తెప్పించాడు. అతని సోదరుడైన సిద్కియాను యూదా మీదా యెరూషలేము మీదా రాజుగా నియమించాడు.

11సిద్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు.

12అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. యెహోవా నియమించిన యిర్మియా ప్రవక్త మాట వినలేదు. అతని ఎదుట తనను తాను తగ్గించుకోలేదు.

13దేవుని పేర తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు. అతడు తలబిరుసుగా ప్రవర్తించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు లోబడక తన మనస్సును కఠినం చేసుకున్నాడు.

14అంతేకాక యాజకులూ ప్రజలలో నాయకులంతా అన్య ప్రజలు చేసే నీచమైన పనులు చేస్తూ యెరూషలేములో యెహోవా ప్రతిష్టించిన మందిరాన్ని అపవిత్ర పరచారు.

15వారి పూర్వీకుల దేవుడైన యెహోవా తన ప్రజల మీదా, తన నివాస స్థలం మీదా జాలి పడి వారి దగ్గరికి తన రాయబారులతో సందేశాలు పంపిస్తూ వచ్చాడు.

16అయితే వారు దేవుని రాయబారుల్ని ఎగతాళి చేస్తూ ఆయన మాటల్ని తృణీకరిస్తూ ఆయన ప్రవక్తలను హింసిస్తూ ఉండటం వల్ల యెహోవా కోపం తీవ్రంగా ఆయన ప్రజల మీదికి వచ్చింది.

17అందుచేత ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పించాడు. అతడు వారి పరిశుద్ధ స్థలంలోనే వారి యువకుల్ని కత్తితో చంపేసాడు. అతడు యువకుల మీద గానీ, కన్యల మీద గానీ ముసలి వారి మీద గానీ నెరసిన వెండ్రుకలు గల వారి మీద గానీ జాలి పడలేదు. దేవుడు వారందరినీ అతని వశం చేశాడు.

18దేవుని మందిరం లోని వస్తువులన్నిటినీ పెద్దవీ, చిన్నవీ, యెహోవా మందిరం నిధులూ, రాజు నిధులూ, రాజు అధికారుల నిధులన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు పోయాడు.

19వారు దేవుని మందిరాన్ని తగలబెట్టి, యెరూషలేము గోడల్ని పడగొట్టారు. దాని భవనాలన్నిటినీ కాల్చివేశారు. దానిలోని అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేశారు.

20కత్తిపాలు కాకుండా తప్పించుకున్న వారిని రాజు బబులోను తీసుకుపోయాడు. పారసీకుల రాజ్యం వచ్చే వరకు వారు అక్కడే ఉండి అతనికీ అతని కొడుకులకూ దాసులుగా ఉన్నారు.

21యిర్మీయా పలికిన యెహోవా మాట నెరవేరేలా దేశం విశ్రాంతి అనుభవించే వరకు ఇది సంభవించింది. దేశం పాడుగా ఉన్న 70 ఏళ్ల కాలం దానికి విశ్రాంతి కాలంగా ఉంది.

22పారసీకదేశపు రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరం యిర్మీయా ద్వారా పలికిన తన మాట నెరవేర్చడానికి యెహోవా పారసీకదేశపు రాజు కోరెషు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా చాటించి రాత పూర్వకంగా ఇలా ప్రకటన చేయించాడు.

23<<పారసీకదేశపు రాజు కోరెషు ఆజ్ఞాపించేది ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుడైన యెహోవా అన్ని రాజ్యాలనూ నా వశం చేశాడు. యూదాలో ఉన్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. ఆయన ప్రజలైన మీరెవరైనా యెరూషలేము వెళ్ళవచ్చు. మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక.>>



 <<  2 Chronicles 36 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran